ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. టెన్షన్‌.. అటెన్షన్‌!

30 Jun, 2022 12:58 IST|Sakshi
నగరంలో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ కటౌట్‌

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లలో పోలీసులు  

అగ్నిపథ్, ఇతరత్రా నేపథ్యంలో అలర్ట్‌

హెచ్‌ఐసీసీలో తాత్కాలిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో పోలీసుల్లో టెన్షన్‌ నెలకొంది. జులై 2, 3వ తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్న మోదీ.. 3న సాయంత్రం 4 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే విజయ సంకల్ప సభలోనూ ప్రసంగించనున్నారు. నగరంలో 28 నుంచి 30 గంటల పాటు గడపనున్న ప్రధాని పర్యటనను విజయవంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

మోదీతో పాటు సుమారు 35– 40 మంది కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొననున్నారు. వీరంతా నగరానికి వచ్చి తిరిగి వెళ్లే వరకూ పోలీసులకు టెన్షన్‌ తప్పదు. ఏ చిన్న పొరపాటు దొర్లినా అది పెను వివాదానికి దారి తీస్తుంది. దీంతో భద్రత ఏర్పాట్లలో ప్రతి అంశాన్ని పోలీసులు నిశితంగా సమీక్షిస్తున్నారు. 

ముందస్తు అరెస్ట్‌లు.. 
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారితీయడం, ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వటంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో అకస్మాత్తుగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ) దాడులకు నిరసనగా, ప్రవక్తపై సస్పెండ్‌ అయిన బీజేపీ నేత నుపుర్‌ శర్మ వ్యాఖ్యలపై వివాదం నేపథ్యంలో.. అసాంఘిక శక్తులు, నిరసనకారులు మోదీ పర్యటనను అవకాశంగా తీసుకున్న ప్రయత్నాలు జరుగుతాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటివన్నింటినీ ముందస్తుగా గుర్తించేందుకు సోషల్‌ మీడియా మాధ్యమాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏమాత్రం తేడా అనిపించినా ముందస్తు అరెస్ట్‌లకు సిద్ధమవుతున్నారు. 

గుమిగూడితే అరెస్టులే 
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సైబరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1 నుంచి 4 వ తేదీ వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అయిదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. విధుల్లో ఉన్న పోలీసులు, సైనిక సిబ్బంది, హోమ్‌ గార్‌డ్స్లతో పాటు అంత్యక్రియలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. నింబంధనలు ఉల్లంఘించిన వారిపై 144 సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

హెచ్‌ఐసీసీని పరిశీలించిన సీపీ
గచ్చిబౌలి: నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర బుధవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీని పరిశీలించారు. సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులు రానుండటంతో హెచ్‌ఐసీసీని ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు అధికారులతో సమావేశమైన అనంతరం హెచ్‌ఐసీసీలోని సభా ప్రాంగణం, హెలిప్యాడ్, అతిథులు బస చేసే నోవాటెల్‌ హోటల్‌ను పరిశీలించారు.

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసే పనిలో సైబరాబాద్‌ పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. పలువురు ఐపీఎస్‌ అధికారులతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌  అమయ్‌ కుమార్, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్‌ వంశీ మోహన్‌ తదితరులు ఉన్నారు. బుధవారం బీజేపీ నాయకులు సైతం హెచ్‌ఐసీసీలో ఏర్పాట్లను పరిశీలించారు. వీరిలో ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్‌ తదితరులు ఉన్నారు.

కదలికలపై డేగకన్ను.. 
ఇప్పటికే హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ హోటల్స్‌లో ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా, హైటెక్స్‌ ప్రాంగణంలోకి ఎంట్రీ నుంచి నోవాటెల్‌ హోటల్‌ వరకు దారి పొడవునా పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో తాత్కాలిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానిస్తున్నారు. వీటిని సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వీటిని వీక్షించనున్నారు. హైటెక్స్‌ ప్రాంగణంలోకి ఎంట్రీ అయిన వ్యక్తి ప్రతి కదలికలను గుర్తిస్తారు. ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా.. వెంటనే క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసులను అలర్ట్‌ చేస్తారు. 

ఎయిర్‌పోర్టులో స్వాగత సన్నాహాలు 
శంషాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేంందుకు కమలనాథులు భాగ్యనగరం బాట పట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధ్యక్షులు బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. బీజేపీ నేతలకు స్వాగతం పలికేందుకు శంషాబాద్‌ విమానాశ్రయంలోని అరైవల్‌ లాంజ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించే విధంగా గోల్కొండ కోట, ఓరుగల్లు కోటలతో పాటు పుణ్యక్షేత్రాల చిత్రపటాలతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో సైబరాబాద్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగుతోంది. పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు.

చదవండి: ‘సాలు దొర’.. ‘సంపకు మోదీ’ 

మరిన్ని వార్తలు