డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్లకు చెక్‌ పెట్టిన హైదరాబాద్‌ పోలీసులు

19 Oct, 2021 16:30 IST|Sakshi

మార్కెట్‌లోకి ఎన్ని బైకులు వ‌చ్చినా బుల్లెట్ బండికి ఉండే క్రేజే వేరు. యువ‌త‌లో చాలామంది క‌ల‌ల బండి బల్లెట్టే.. అబ్బాయిల‌కే కాదు.. అమ్మాయిల‌కు కూడా ఈ బండి అంటే విప‌రీత‌మైన పిచ్చి. అందుకే రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన‌ పాటలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బండి ఇంజిన్ సౌండ్ చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది. డుగ్గు డుగ్గు డుగ్గు అంటూ వచ్చే సౌండ్‌కే యువత పడిపోతారు.

అయితే బుల్లెట్‌ సౌండ్‌పై ఉన్న మోజుతో చాలామంది బండి సైలెన్సర్‌లను ఎక్కువ శబ్దం వచ్చేలా ప్రత్యేకించి రూపొందించుకుంటారు. ఇవి రోడ్డుమీద వెళ్తుంటే భారీ సౌండ్‌తోపాటు శబ్ధ కాలుష్యానికి కారణంగా మారుతోంది. తాజాగా హైదరాబాద్‌ సిటీ పోలీసుల కన్ను ప్రత్యేకంగా తయారు చేసుకున్న బుల్లెట్‌ బండి సైలెన్సర్స్‌పై పడింది. దీంతో ప్రత్యేకించి తయారు చేయించుకున్న వందలాది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండ్ల సైలెన్సర్లను వారు స్వాధీనం చేసుకున్నారు.

వీటన్నింటిని ఒక్కచోట చేర్చిన ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రోలర్‌ సాయంతో సైలెన్సర్‌లను నలిపివేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను హైదరాబాద్‌ పోలీస్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్‌ ఇప్పుడు సైలెన్స్‌ అయిపోయాయని ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు