ట్విటర్‌లో ఫోటో షేర్‌.. పోలీసులకే పంచ్‌ వేసిన నెటిజన్‌

30 Mar, 2022 07:59 IST|Sakshi

‘ది క్యాన్సర్‌ హబ్‌’కు పేరు పెట్టండి

ట్విట్టర్‌లో కోరిన నగర పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులు, గుట్కాలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలోనే వీటి అక్రమ దందాలపై పోలీసులు డేగకన్ను వేసి ఉంచుతున్నారు. తరచుగా దాడులు చేస్తూ ఇవి కలిగి ఉన్న, విక్రయిస్తున్న వా రిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఓపక్క ఈ చర్యలు కొనసాగిస్తూనే మరోపక్క ఈ ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే నష్టాలపై అవగాహనకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నగర పోలీసు అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో సోమవారం ఓ ఫొటోను షేర్‌ చేశారు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయించే ఓ పాన్‌ డబ్బా ఫొటోను పొందుపరిచారు.

అందులో సదరు డబ్బాపై ది క్యాన్సర్‌ హబ్‌ అని రాసి ఉంది. ఈ హబ్‌కు సరైన పేరు సూచించండి అంటూ నెటిజనుల్ని పోలీసులు కోరారు. ఈ పోస్టు నో గుట్కా, నో టొబాకో హ్యాష్‌ టాగ్స్‌తో వైరల్‌ అయింది. దీనికి స్పందించిన అనేక మంది పలు ఆకర్షణీయమైన, చిత్రమైన పేర్లు సూచించారు. దీనిపై ఘాటుగా స్పందించిన నెటిజనులు ఉన్నా రు. ఓ ట్విట్టర్‌ వినియోగదారు.. ‘ఆర్టీఏ, రిజిస్ట్రేషన్‌ ఆఫీసు వంటి ప్రభుత్వ కార్యాలయాల వద్ద కరప్షన్‌ హబ్‌ అనే బోర్డు పెట్టాలి’ అని సూచించారు. నగరంలో వీటి విక్రయంపై నిషేధం ఉండటంతో ఈ ఫొటో ఎక్కడదనే సందేహం అనేకమందికి కలుగుతోంది. ఈ వివరాలు సిటీ పోలీసులు తమ పోస్టులో ప్రకటించలేదు.

చదవండి: విద్యార్థిని స్నేహితుడే హతమార్చాడా..? 

మరిన్ని వార్తలు