గుర్తుపెట్టుకోండి.. అలాంటి కాల్స్‌ చేసిన కటకటాలే!

11 Mar, 2022 17:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టెలీకాలర్లపై సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ఇప్పటి వరకు వీటి నిర్వాకులను మాత్రమే అరెస్టు చేస్తూ... ఉద్యోగులైన కాలర్లను వదిలేసేవారు. అయితే నేరాలకు అడ్డుకట్ట వేయడానికి సూత్రధారులతో పాటు పాత్రధారులనూ అరెస్టు చేయడం తప్పనిసరని భావించిన అధికారులు టెలీ కాలర్లపైనా చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలో జాబ్‌ ఫ్రాడ్‌ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు టెలీ కాలర్లను అరెస్టు చేయగా... బుధవారం నాటి లోన్‌ యాప్స్‌ కేసులో 60 మందికి నోటీసులు జారీ చేశారు. ఇకపై ఈ విధానం కొనసాగనుంది. 

►లోన్‌ యాప్స్, జాబ్‌ ఫ్రాడ్, ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్, కేవైసీ అప్‌డేట్‌.. ఇలా వ్యవస్థీకృతంగా జరిగే సైబర్‌ నేరాలకు ఉత్తరాదితో పాటు బెంగళూరులో ఉన్న కాల్‌ సెంటర్లే అడ్డాలుగా ఉంటున్నాయి.
►ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్లగ్‌ అండ్‌ ప్లే కార్యాలయాలను అద్దెకు తీసుకుంటున్న సూత్రధారులు ఆన్‌లైన్‌లో లక్షల సంఖ్యలో మొబైల్‌ నెంబర్లు ఖరీదు చేస్తున్నారు. టెలీ కాలర్లను ఏర్పాటు చేసుకుని ఆయా నంబర్లకు ఫోన్లు చేయిస్తున్నారు.
►ఎదుటి వారితో ఆకర్షణీయంగా మాట్లాడి వలవేయటానికి టెలీ కాలర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి వారిలో అత్యధికులు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన యువతులే ఎక్కువగా ఉంటున్నారు.

►వీరిని పర్యవేక్షించే సూపర్‌వైజర్లు, మేనేజర్లు మాత్రం కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా సైబర్‌ నేరం దర్యాప్తులో కాల్‌ సెంటర్‌ గుట్టు బయటపడితే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వాటిపై దాడులు చేస్తున్నారు.
►కొన్ని రోజుల ముందు వరకు సూత్రధారులతో పాటు సూపర్‌వైజర్లు, మేనేజర్లను మాత్రమే అరెస్టు చేసేవారు.  టెలీకాలర్లకు కౌన్సెలింగ్‌ చేసి వదిలిపెట్టేవాళ్లు.  
►అయితే ఇలా ఓ కాల్‌ సెంటర్‌ నుంచి బయటకు వచ్చిన టెలీకాలర్లు మరో దాంట్లో చేరుతున్నారు. వీరికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదని సూత్రధారులు వీరికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వీరు మరికొందరిని బాధితులుగా మారుస్తున్నారు.  
►దీనిని గుర్తించిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు టెలీకాలర్ల పైనా చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కాల్‌ సెంటర్‌పై దాడి చేశారు. 
►ఈ కేసులో సూత్రధారులతో సహా ఐదుగురు టెలీ కాలర్లను అరెస్టు చేశారు. వీరందరినీ సిటీకి తరలించి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు.
►బెంగళూరులోని లోన్‌ యాప్స్‌ కాల్‌ సెంటర్‌లో మాత్రం 60 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి సిటీకి తీసుకురావడంలో అనేక ఇబ్బందులు ఉంటాయని అధికారులు గుర్తించి, ఇద్దరు సూత్రధారుల్ని తరలించారు. 
►దీంతో వారందరినీ నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తామని అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం వీరు నడుచుకోవాలని వివరించారు.      

మరిన్ని వార్తలు