చేనేతకు గుర్తింపుతో ఉపాధి అవకాశాలు

14 May, 2022 02:27 IST|Sakshi
పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాల్‌ తపాలా కవర్లను ఆవిష్కరిస్తున్న విద్యాసాగర్‌రెడ్డి  

హైదరాబాద్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ విద్యాసాగర్‌రెడ్డి 

‘పోచంపల్లి ఇక్కత్, తేలియా రుమాల్‌’ తపాలా కవర్ల ఆవిష్కరణ

భూదాన్‌పోచంపల్లి: చేనేతకు గుర్తింపునివ్వడం ద్వారా మార్కెటింగ్‌ పెరిగి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని హైదరాబాద్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని టై అండ్‌ డై అసోసియేషన్‌ భవన్‌లో శుక్రవారం పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాల్‌పై తపాలా కవర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌ కలిగిన పోచంపల్లి ఇక్కత్‌తో పాటు తేలియా రుమాల్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో తపాలా శాఖ ప్రత్యేక కవర్లను ముద్రించిందన్నారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు పంపించడానికి తపాలా శాఖ పార్శిల్‌ సేవలను అందిస్తుందని తెలిపారు.

నెలకు రూ.50 వేల కంటే ఎక్కువ పార్శిల్‌ బిల్లులు చెల్లించేవారికి 10 శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు క్రెడిట్‌ అవకాశం కూడా కల్పిస్తామన్నారు. కాగా, ఇక్కత్‌ డిజైన్లపై తపాలా స్టాంప్‌ను కూడా విడుదల చేయాలని హైదరాబాద్‌ వీవర్‌ సర్వీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ కోరారు.

చేనేత కార్మికులు తమకు అందుబాటులో ఉన్న మార్గాలను సద్వినియోగం చేసుకొని వస్త్ర ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్‌ను మరింత విస్తరించుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో చేనేత టై అండ్‌ డై అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి భారత లవకుమార్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోస్టల్‌ సూపరింటెండెంట్‌లు వెంకటసాయి, యెలమందయ్య తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు