Prajavani: రెండున్నరేళ్లుగా మూగబోయిన ప్రజావాణి

20 Dec, 2022 13:17 IST|Sakshi

కోవిడ్‌ ప్రభావం తగ్గినా.. గేటు వద్ద నే ఆర్జీల స్వీకరణ

సమస్యలు పరిష్కారం కాక నగర వాసుల గగ్గోలు  

సాక్షి, హైదరాబాద్‌: సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో ప్రజల ఆవేదన వినేవారు లేకుండా పోయారు. గత రెండున్నరేళ్లుగా ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణి (గ్రీవెన్స్‌ సెల్‌) మూగబోయింది. కోవిడ్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీతోపాటు హైదరాబాద్‌ కలెక్టరేట్‌లలో  2020 మార్చి 17 నుంచి ప్రజావాణి కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ–ఆఫీస్‌ ద్వారా కాగిత రహిత పాలనను చేపట్టారు. 

వివిధ సమస్యలపై వస్తున్న ప్రజల నుంచి నేరుగా కాకుండా దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా, ఆ తర్వాత  కలెక్టరేట్‌లోని ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక బాక్స్‌ ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. కోవిడ్‌ వైరస్‌ ప్రభావం తగ్గినా... నేటికి గేటు వద్దనే మొక్కుబడిగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ దరఖాస్తుల్లో కనీసం 10 శాతం కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 

ఆఫీసుల చుట్టూ చక్కర్లు 
నగర వాసులు తమ సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ కలెక్టర్‌ రెవెన్యూ ఆఫీసుల నిత్యం ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు ఎవరికి సమర్పించాలో తెలియని పరిస్ధితి నెలకొంది. సంబంధిత అధికారులు సైతం అందుబాటు లేక పోవడంతో వారిని పట్టించుకునేవారు కరువయ్యారు. దరఖాస్తులు సమర్పించినా... పరిష్కారమవుతుందన్న ఆశ కనిపించడం లేదు. దీంతో దళారులు, రాజకీయ నాయకులను ఆశ్రయించక తప్పడం లేదు. 

పెరిగిన పెండెన్సీ... 
ప్రభుత్వ పరంగా పేదలకు అందించే ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ ఆర్ధిక చేయూత, సంక్షేమ రుణాలు, డబుల్‌ బెడ్‌రూమ్, సదరం సర్టిఫికేట్‌ తదితర దరఖాస్తులు పెండెన్సీ పెరిగిపోతోంది. దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. కనీసం ప్రజావాణి పునరుద్దరిస్తే అందులో తమ దరఖాస్తులకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. (క్లిక్ చేయండి: మన కార్లపై భారత్‌ సిరీస్‌ ఎప్పుడు? దీంతో లాభలేంటి..?)

మరిన్ని వార్తలు