ప్రసూతి కోసం వచ్చి ఆస్పత్రిలో...

25 Aug, 2021 07:58 IST|Sakshi

దూద్‌బౌలి: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ గర్భిణి సోమవారం రాత్రి మృతి చెందింది. దీంతో  కుటుంబ సభ్యులు  వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి ఆవరణలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను సముదాయించారు. మృతురాలు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ బంధువు కావడంతో ఆస్పత్రి వద్ద కొద్దిసేపు నినాదాలు చేశారు.

గోషామహల్‌ ప్రాంతానికి చెందిన సరిత (40)ను ఈ నెల 11న  ప్రసవం కోసం పేట్లబురుజు ఆస్పత్రిలో చేర్పించారు. చేర్పించిన నాటి నుంచి వైద్యులు సరితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి సరితకు బీపీ అధికం కావడంతో ప్రసవం కాకుండానే మృతి చెందింది. దీంతో కోపోద్రేక్తులైన కుటుంబ సభ్యులు  వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంవల్లే సరిత మృతి చెందిందని ఆరోపించారు. ఆస్పత్రి అధికారులు మాత్రం సరిత అధిక బరువు, బీపీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆమెను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని... ఇందులో తమ పొరపాటు లేదన్నారు. సరిత 20 ఏళ్ల అనంతరం గర్భం దాల్చిందని తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.   

మరిన్ని వార్తలు