ఉన్నకాడికి ఊడ్చేసి.. చివరికి గాంధీకి

23 Apr, 2021 08:02 IST|Sakshi

ఉన్నకాడికి ఊడ్చేసి..వెంటిలేటర్‌తో గాంధీ ఐసీయూకు తరలింపు 

పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత రాక.. 

వచ్చిన కొద్ది సేపటికే మృతి.. ఆందోళనలో బంధువులు 

గాంధీకి రోజుకు సగటున ఇలా 100కు పైగా రిఫరల్‌ కేసులు  

హైదరాబాద్‌: నిజామాబాద్‌కు చెందిన రాజేందర్‌ (52)కు పది రోజుల క్రితం కోవిడ్‌ నిర్ధారణ అయింది. చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరు రోజుల పాటు వెంటిలేటర్‌ సపోర్ట్‌తో చికిత్సలు అందించారు. ఇందుకు రూ.4.18 లక్షల బిల్లు వేశారు. తీరా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు. గత్యంతరం లేక చివరకు అదే వెంటిలేటర్‌ సహాయంతో బుధవారం రాత్రి గాంధీకి తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే ఆయన మృతి చెందారు. 

హుజూరాబాద్‌కు చెందిన సమ్మయ్య(40)కు వారం రోజుల క్రితం కోవిడ్‌ నిర్ధారణ అయింది. తొలుత వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక రోజు చేర్చుకుని రూ.90 వేల బిల్లు వేశారు. తీరా తమ వల్ల కాదని, హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఆయన్ను బుధవారం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రెండు గంటల పాటు ఎమర్జెన్సీలో ఉంచుకున్నారు. రూ.20 వేలకుపైగా ఛార్జీ చేశారు. అనంతరం వెంటిలేటర్లు లేవని చెప్పి బయటికి పంపారు. దిక్కుతోచని స్థితిలో వారు రాత్రి 2 గంటలకు గాంధీకి చేరుకున్నారు. అప్పటికే ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేకపోవడంతో ఆక్సిజన్‌పై ఉంచారు. ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు... ఇలా ఒక్క రాజేందర్, సమ్మయ్య మాత్రమే కాదు...కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరుతున్న అనేక మందిని ఉన్నకాడికి ఊడ్చేసి..చివరి నిమిషంలో..మా వల్ల కాదంటూ..ఇలాగే వదిలించుకుంటున్నాయి. 

వాళ్లు దోచుకుంటే..నిందలు మాపైనా?
రోగి ఆస్పత్రిలో చనిపోతే..రోగి బంధువులు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. అంతే కాదు ఆస్పత్రి ఇమేజ్‌ దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత చికిత్సకు రోగి స్పందించడం లేదని..అయినా ఐసీయూలో ఉంచితే..వైద్య ఖర్చులు రోజుకు రూ.60 వేలకుపైగా అవుతుందని బంధువులను భయపడుతున్నారు. మెరుగైన వైద్యం అందాలంటే గాంధీకి తీసుకెళ్లడం ఒక్కటే పరిష్కారమని సూచిస్తున్నాయి. బలవంతంగా వారిని వదిలించుకుంటున్నారు. అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో గాంధీ వైద్యులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇలా ఆఖరి నిమిషంలో వచ్చిన వారిలో కొంత మంది ఆస్ప్రతిలో చేరిన కొద్ది సేపటికే మృతి చెందుతుండగా...మరికొంత మంది రెండు మూడు రోజుల తర్వాత కన్ను మూస్తున్నారు. చికిత్సల పేరుతో లక్షల రూపాయలు దోచుకుంది కార్పొరేట్‌ ఆస్పత్రులైతే...చికిత్సల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలను గాంధీ వైద్యులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
 
వందకుపైగా అడ్మిషన్లు..20లోపే డిశ్చార్జిలు 
1850 పడకలు ఉన్న గాంధీ ఆస్పత్రిలో 500 వెంటిలేటర్లు, 1250 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. ప్రస్తుతం వెంటì లేటర్లు ఖాళీ లేవు. ఆక్సిజన్‌ పడకలపై కూడా 250 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి నేరుగా వచ్చే కేసులతో పోలిస్తే కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి రిఫరల్‌పై వస్తున్న కేసులే అధికం. నేరుగా వచ్చిన కేసులకు పడకలు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే సోమవారం 110 మంది వస్తే..మంగళవారం 205 మంది వచ్చారు. బుధవారం 185 మంది వచ్చారు. డిశ్చార్జిలు అవుతున్న వారు కేవలం 20లోపే. కొత్తగా వెంటిలేటర్‌తో వచ్చిన వారికి చేర్చుకోలేని దుస్థితి. అనివార్య పరిస్థితుల్లో వారిని ఆక్సిజన్‌ పడకలపై ఉంచాల్సి వస్తుండటంతో ఊపిరాడక వారు ముందే చనిపోతున్నారు.

( చదవండి: గాంధీ ఆస్పత్రి: కరోనా బాధితులు ఫుల్, ఐసీయూ బెడ్లు నిల్ )   

మరిన్ని వార్తలు