జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం: దారుణాలకు ఆ వాహనాలే కారణమా?

11 Jun, 2022 09:18 IST|Sakshi

అసాంఘిక శక్తులకు కేరాఫ్‌గా వాహనాలు

గడువు ముగిసినా శాశ్వత రిజిస్ట్రేషన్లకు దూరం

చిరునామా, యాజమాన్య బదిలీల్లోనూ నిర్లక్ష్యం

ఏ బండి ఎవరిదో తెలియని గందరగోళం

నేరాలు, ప్రమాద ఘటనల్లో వీడని చిక్కులు 

జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచార ఉదంతం

టెంపరరీ రిజిస్ట్రేషన్‌పైనే ఇన్నోవా కారు

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచార ఉదంతంలో పోలీసులు గుర్తించిన ఇన్నోవా కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌)పైనే తిరుగుతున్నట్లు నిర్ధారించారు. అదొక్కటే గ్రేటర్‌లో వేలకొద్దీ వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లపైనే తిరుగుతూ గందరగోళానికి కారణమవుతున్నాయి. సాధారణంగా బండి కొనుగోలు చేసిన  30 రోజుల లోపు వాహన యజమాని తన పేరిట శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అపరాధ రుసుముతో  6 నెలల్లోపు కూడా శాశ్వతంగా నమోదు చేసుకొనేందుకు రవాణాశాఖ వెసులుబాటు కల్పించింది.

కానీ.. కొంతమంది వాహనదారులు నిర్లక్ష్యంతో కాలయాపన చేయడం గమనార్హం. మరోవైపు మరికొందరు ద్విచక్ర వాహనదారులు సంవత్సరాలు గడిచినా శాశ్వత నమోదు చేసుకోకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్లపైనే రహదారులపై పరుగులు తీస్తున్నారు. దీంతో అనూహ్యమైన  పరిస్థితుల్లో వాహనాల గుర్తింపులో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఇలా తాత్కాలిక నమోదుపై ఉన్న వాహనాల విషయంలో రవాణాశాఖ కేవలం అపరాధ రుసుముకే పరిమితం కావడంతో వాహనదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. 

నచ్చిన నంబర్‌ కోసం ఎదురు చూపులు..
►  అదృష్ట సంఖ్యలుగా భావించే  ప్రత్యేక నంబర్ల కోసం ఎదురు చూస్తూ కొందరు వాహనదారులు తాత్కాలిక నమోదుపైనే బండ్లను నడుపుతున్నారు. మూడు నెలలకోసారి   వచ్చే సిరీస్‌లో ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా నచ్చిన నంబర్‌ లభించకపోతే  మరో 3 నెలలు ఆగాల్సిందే. కొంతమంది తమకు నచ్చిన నంబర్‌ లభించే వరకు ఈ తరహా కాలయాపన చేస్తున్నారు. దీంతో వాహనాలపైన అతికించిన టీఆర్‌ నంబర్‌ స్టిక్కర్లు కూడా చిరిగిపోయి తాత్కాలిక గుర్తింపు కూడా కనిపించకుండా మాయమవుతోంది. గ్రేటర్‌లో ప్రతి రోజూ సుమారు 1650కిపైగా వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. వీటిలో  500 వరకు కార్లు ఉంటే మరో 1100కుపైగా బైక్‌లు, ఇతర వాహనాలు ఉంటాయి. సాధారణంగా అన్ని రకాల రవాణా వాహనాలు కచ్చితంగా నిర్ణీత గడువు మేరకు శాశ్వత నమోదుపైనే  తిరుగుతాయి. వ్యక్తిగత వాహనాల విషయంలోనే ఈ నిర్లక్ష్యం కనిపిస్తోంది.  
 
చిరునామా మార్పు అవసరమే..
►  కొందరు వాహనదారులు తాము ఇల్లు మారిన వెంటనే వాహనాలను కూడా కొత్త చిరునామాకు మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ.. అలా మార్చుకోకపోవడంతో ప్రమాదాల బారినపడినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాహనదారులను గుర్తించడం కష్టంగా మారుతోంది. వాహన యాజమాన్య బదిలీ, చిరునామా మార్పు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్‌ హెచ్చరించారు.  

‘మార్పు’ మరిచిపోతే కష్టమే.. 
►  మరోవైపు చాలా మంది తమ పాత బండ్లను అమ్ముకొని కొత్తవి కొనుగోలు చేస్తారు. అలా విక్రయించే సమయంలో బండి యాజమాన్య మార్పిడి కూడా తప్పనిసరి. కానీ ఇటు విక్రయించిన వారు, అటు కొనుగోలు చేసిన వారు సకాలంలో యాజమాన్య మార్పు చేసుకోవడం లేదు. బండి మాత్రం ఒకరి నుంచి మరొకరికి అనధికార యాజమాన్య మార్పిడికి గురవుతుంది. ఇలాంటి వాహనాలు తరచుగా ప్రమాదాలకు పాల్పడినప్పడు సదరు వాహనాలు ఎవరి పేరిట నమోదై ఉంటే వారే మూల్యం చెల్లించవలసి వస్తుంది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపైనా భారీ ఎత్తున జరిమానాలు నమోదు కావడం గమనార్హం.  

►  అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు  వినియోగించే వాహనాల్లోనూ వాటి అసలైన యజమానులే నష్టపోవాల్సివస్తుంది. బండిని విక్రయించినప్పుడే యాజమాన్యం కూడా బదిలీ చేసుకోకపోవడం వల్ల అప్పటి వరకు ఎవరి పేరిట నమోదై  ఉంటే వారే ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సి రావడం  గమనార్హం. గతంలో నగరంలో కొన్ని చోట్ల చోటుచేసుకున్న హత్యలు, తదితర నేరాల్లో ఇలాంటి గుర్తుతెలియని వాహనాలతో వాటి మొదటి యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉన్నాయి.

చదవండి: బాబాయ్‌ అంటే భయం.. అదే అలుసుగా తీసుకుని మూడు రోజులుగా..

మరిన్ని వార్తలు