పెరుగుతున్న విమాన ప్రయాణికులు.. వారి కోసం స్పెషల్‌గా..

11 Jun, 2022 10:32 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 24 పుష్పక్‌ బస్‌షెల్టర్లు

పీపీపీ విధానంలో తగిన సదుపాయాలు 

నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాట్లకు చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: విమాన ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతుండటంతో అందుకనుగుణంగా నగరంలో అదనంగా పుష్పక్‌ బస్‌ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. సాధారణ బస్‌షెల్టర్ల మాదిరిగా కాకుండా ప్రయాణికులకు తగిన సదుపాయాలతో వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి పీపీపీ విధానంలో అవకాశం కల్పిస్తూ ఏర్పాట్లు చేసేందుకు టెండరు దక్కించుకునే ఏజెన్సీతో జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకోనుంది.

డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. జీహెచ్‌ఎంసీ పేర్కొన్న నిబంధనలకనుగుణంగా బస్‌షెల్టర్లను తగిన సదుపాయాలతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. షెల్టర్ల  ప్యానెల్స్‌పై  ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎంపికైన ఏజెన్సీ పొందుతుంది. ఈ ఒప్పందం పదేళ్ల వరకు అమలులో ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు.  

షెల్టర్‌ ఏర్పాటు ఇలా.. 
షెల్టర్‌ను 25్ఠ8 అడుగుల విస్తీర్ణంతో తగిన వెంటిలేషన్‌ ఉండేలా అల్యూమినియం గ్రిల్స్, పీవీసీ స్లైడింగ్‌ గ్లాస్‌ విండోస్‌ తదితరమైన వాటితో  ఏర్పాటు చేయాలి.  షెల్టర్‌లో మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు చార్జింగ్‌ చేసుకునే సదుపాయంతోపాటు లైటు, ఫ్యాను, కూర్చునేందుకు సదుపాయాలుండాలి. జీహెచ్‌ఎంసీ సూచించిన డిజైన్‌ కనుగుణంగా వీటిని ఏర్పాటు  చేయాలి.  జీహెచ్‌ఎంసీ ఆమోదంతో స్వల్ప మార్పులు చేయవచ్చు. తగిన పెట్టుబడి ధనాన్ని కలిగి ఉండటంతోపాటు  బస్‌షెల్టర్ల ఏర్పా టు, నిర్వహణలో గతంలో అనుభవమున్నవారే వీటిని ఏర్పాటు చేసేందుకు అర్హులని పేర్కొన్నారు.  

నిర్వహణ ఇలా.. 
►   నిబంధనల మేరకు టెండరు పొందే ఏజెన్సీ ఆపరేషన్‌లో భాగంగా దిగువ పేర్కొన్న అంశాలు పాటించాలి. అన్ని బస్‌షెల్టర్లు, వాటి పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. చెత్తడబ్బాలు పూర్తిగా నిండకముందే  చెత్త ఖాళీ చేయాలి. ప్రకటనల ప్యానెల్స్‌ దుమ్ము, మరకలు లేకుండా ఎల్లవేళలా శుభ్రంగా ఉండాలి. పోస్టర్ల వంటివి 
అతికించరాదు. 
►  పైకప్పు నుంచి లీకేజీలు ఉండరాదు. నీరు,  ద్రవాల  వంటివి నిల్వ ఉండరాదు. తగిన డ్రైనేజీ ఏర్పాట్లుండాలి. లైటింగ్‌ ఏర్పాట్లు ఎల్లవేళలా ఉండాలి. ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ఏర్పాట్లుండాలి.  ఫ్లోర్‌ టైల్స్‌ పగిలిపోతే, మూడు రోజుల్లోగా తిరిగి ఏర్పాటు చేయాలి. షెల్టర్లలో  ఉండే సిబ్బంది చదువుకున్నవారై ఉండి,ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి. వృద్ధులు, శారీరక వికలాంగులకు అవసరమైన సహాయం చేయాలి. వీటితోపాటు మరికొన్ని నిబంధనలు పాటించాలి. విఫలమైతే ఒక్కో బస్‌షెల్టర్‌కు రోజుకు రూ.2వేల వంతున పెనాల్టీ విధించేందుకు జీహెచ్‌ఎంసీకి అధికారం ఉంటుంది.  

కొత్తగా పుష్పక్‌ బస్‌షెల్టర్లు ఏర్పాటు కానున్న ప్రదేశాలివే:
నాగోల్‌ క్రాస్‌రోడ్, ప్యాట్నీ, రాణిగంజ్, లక్డీకాపూల్, ఎన్‌ఎండీసీ, మెహిదీపట్నం, ఆరాంఘర్, యాత్రినివాస్, బేగంపేట్, నిమ్స్, కేర్‌ హాస్పిటల్, నిజాంపేట్‌ క్రాస్‌రోడ్, ఫోరమ్‌మాల్, మలేషియన్‌ టౌన్‌సిప్, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్, మదీనగూడ, కొండాపూర్, కొత్తగూడ, ర్యాడిసన్‌ హోటల్‌. (వీటిలో ఎన్‌ఎండీసీ, మెహిదీపట్నం, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్, ఆరామ్‌ఘర్‌ల వద్ద రెండేసి బస్‌షెల్టర్ల చొప్పున మొత్తం 24 బస్‌షెల్టర్లను ఎంపికయ్యే ఏజెన్సీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.) 

చదవండి: జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం: దారుణాలకు ఆ వాహనాలే కారణమా?


 

మరిన్ని వార్తలు