వీడియోలు: ఇది బెంగళూరు కాదు.. హైదరాబాదే!.. వరదలపై పేలుతున్న సెటైర్లు

13 Oct, 2022 09:51 IST|Sakshi

వైరల్‌: నగరంలో బుధవారం రాత్రి కురిసిన జడివాన.. రోడ్లను జలమయం చేసేసింది. మరోవైపు వరద నీరు, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వీధులన్నీ చెరువులను తలపించాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరుకుని.. నగర వాసులు నానా ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు కొట్టుకుని పోగా.. మరికొన్ని చోట్ల కార్లు, ఆటోలు నీట మునిగి పాడైపోయాయి. 

ఇక హైదరాబాద్‌ వరదలపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో హైదరాబాద్‌ వరదలపై బీజేపీ నేతలు సెటైర్లు వేయడాన్ని ఉద్దేశిస్తూ.. మొన్న బెంగళూరు వరదలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌గా స్పందించిన సంగతి తెలిసిందే.  మన నగరాలు రాష్ట్రాలకు ఆర్థిక ఇంజిన్ల లాంటివి. అవి దేశ వృద్ధిని నడిపిస్తాయి. అర్బనైజేషన్ (పట్టణీకరణ), సబ్-అర్బనైజేషన్ వేగవంతంగా జరుగుతున్న వేళ.. అందుకు తగినట్లు నగరాలను అప్‌గ్రేడ్ చేసేందుకు తగినంత పెట్టుబడులు కేటాయించకపోతే మౌలిక వసతులు కుప్పకూలిపోతాయిపట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం అంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ట్యాగ్ చేశారు కేటీఆర్‌. 

అయితే బెంగళూరు ఏకధాటి వర్షాల కంటే.. ఇప్పుడు ఒక్కరాత్రిలో అదీ కొన్నిగంటలపాటు కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కావడంపై సెటైర్లు పేలుస్తున్నారు కొందరు నెటిజన్లు. చిన్నపాటి వర్షానికే మునిగిపోయే హైదరాబాద్ రోడ్లను ఎందుకు బాగు చేయటం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పక్కరాష్ట్రాలకు బోధిస్తున్న మంత్రి కేటీఆర్.. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీల దుస్థితి గురించి ఏం చేస్తున్నారంటూ వీడియోలతో సహా నిలదీస్తున్నారు. ఇది బెంగళూరు, అహ్మదాబాద్‌, ఏ వెనిసో అంతేకంటే కాదని.. హైదరాబాదేనని.. ముందు ఇక్కడి సంగతి చూడాలంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

మరిన్ని వార్తలు