నీ పేరు రాసి చస్తాం: ఎమ్మెల్యేపై మహిళల ఆగ్రహం

15 Oct, 2020 16:42 IST|Sakshi
ఎమ్మెల్యేతో మహిళల వాగ్వివాదం

సాక్షి, హైదరాబాద్‌ : వరద పరిస్థితులను సమీక్షించటానికి బోటులో అధికారులతో వెళ్లిన టీఆర్‌ఎస్‌ ఎ‍మ్మెల్యే సుభాష్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఉప్పల్‌ ప్రాంతంలోని వరదల్లో పర్యటిస్తున్న ఆయనపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. వాగ్వివాదానికి దిగారు. వరదల్లో చిక్కుకున్న తమను సురక్షిత ప్రాంతానికి తరలించటం లేదంటూ మండిపడ్డారు. వరదల్లో ఇలాగే చిక్కుకుని చావాలా? అని ప్రశ్నించారు. నీటిలో చిక్కుకుని చనిపోయేటట్లయితే ‘నీ పేరు రాసి చస్తాం!’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా వేసుకోవటానికి దుస్తులు కూడా లేని పరిస్థితిలో ఉన్నామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇలాంటి ప్రాంతంలో ఇళ్లేందుకు కట్టుకున్నారని ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించారు. ‘విపత్కర పరిస్థితి ఇది.. వర్షం సడెన్‌గా వచ్చింది. అకస్మాత్తుగా వచ్చిందానికి.. ఎవరూ బాధ్యులు కార’ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారులు కూడా ఎమ్మెల్యేకే వంత పాడారు. మహిళలు ప్రశ్నిస్తుండగానే ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు.

మీర్పేట్‌లో కొనసాగుతున్న వరద ఉధృతి
హైదరాబాద్ మీర్పేట్‌లోని జనప్రియ కాలనీలో ఇంకా వరద ఉధృతి కొనసాగుతోంది. పైన ఉన్న చెరువులకు గండి పడటంతో కాలనీలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. నీటి దాటికి వాహనాలు, ఆటోలు, బైకులు కొట్టుకుపోతున్నాయి. పూర్తిగా రాకపోకలు లేకుండా రోడ్డు కోతకు గురైంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలు తీర్చే నాథుడే లేడంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోస్ట్‌మాన్ మృతదేహం లభ్యం
మంగళవారం నాగోల్ బండ్లగూడలో గల్లంతైన పోస్ట్‌మాన్ సుందర్‌రాజు మృతదేహం గురువారం లభ్యమయింది. నాగోల్ చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. 

మరిన్ని వార్తలు