Hyderabad: చారిత్రక సంపదకు నయా నగిషీలు

21 Nov, 2022 11:54 IST|Sakshi
ప్రస్తుతం ముర్గీ చౌక్‌, అభివృద్ధిపర్చిన అనంతం ఇలా ఉంటుంది.. (నమూనా చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: చారిత్రక, సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. నిజాం హయాంలో నిర్మించిన ఆనేక కట్టడాలకు నగిషీలు చెక్కడం ద్వారా భావితరాలకు చారిత్రక వైభవాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా కట్టడాలను పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే మొజంజాహీ మార్కెట్, క్లాక్‌టవర్లు, బన్సీలాల్‌పేట బావిని పునరుద్ధరించిన పురపాలక శాఖ.. తాజాగా ముర్గీ చౌక్, మీరాలం మండి, సర్దార్‌ మహల్‌లకు నయా సొబగులను అద్దాలని నిర్ణయించింది. అంతర్జాతీయ పర్యాటక స్థలాల్లో ఒక్కటిగా చెప్పుకునే చార్మినార్, దాని పరిసరాలను అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ మూడింటిని పునరుద్ధరించే పనులను చకచకా చేస్తోంది. కులీ కుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ వీటిని పర్యవేక్షిస్తోంది. 

వడివడిగా మీరాలంమండి పనులు 
నగర ప్రజల కూరగాయ అవసరాలను తీర్చడానికి 1805లో అప్పటి ప్రధాని నవాబ్‌ మీర్‌ అలం యార్‌జంగ్‌ మీరాలం మండిని ప్రారంభించారు. హైదరాబాద్‌ తొలి మార్కెట్‌గా చెప్పుకొనే ఈ మండి.. ప్రస్తుతం కూడా కొనసాగుతున్నప్పటికీ దయనీయ పరిస్థితిలో ఉంది. కనీస సౌకర్యాల్లేక.. సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.16.45 కోట్లను కేటాయించారు. మార్కెట్‌ను మూడు విభాగాలు విభజించి.. దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. 

సర్దార్‌ మహల్‌ పునరుద్ధరణ.. 
1900లో యూరోపియన్‌ నిర్మాణ శైలిలో నిర్మించిన సర్దార్‌ మహల్‌ చారిత్రక కట్టడం. నిర్వహణ లేక భవనం పూర్తిగా దెబ్బతిన్నది. పూర్వ వైభవం తేవడానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక నిధులను కేటాయించి పనులను ‘కుడా’ ఆధ్వర్యంలో ప్రారంభించనుంది. భవనం శైలి దెబ్బ తినకుండా ఆధునికీకరించనున్నారు. ఈ భవనంలో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పురపాలకశాఖ.. అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు కేటాయించింది. 
చదవండి: ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన వైద్యురాలు.. పసికందు మృతి

శిథిలావస్థలో ముర్గీచౌక్‌.. 
125 ఏళ్ల చరిత్ర కలిగిన కోళ్ల మండి (ముర్గీ చౌక్‌)ని ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ హయాంలో ఏర్పడింది. చికెన్‌తో పాటు మాంసాన్ని సైతం ఇక్కడ విక్రయించేలా మార్కెట్‌ను అభివృద్ధి చేశారు. కాల గమనంలో ఈ మండి శిథిలావస్థకు చేరింది. పురాతన కట్టడాలు పెచ్చులు ఊడిపోయి, రేకుల షెడ్డు ఎగిరిపోవడంతో ముర్గీచౌక్‌ అధ్వానంగా తయారైంది. ఈ మార్కెట్‌ను ఆధునికీకరించాలని ‘కుడా’ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రూ.36 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రౌండ్‌ ప్లస్‌ భవనాన్ని నిర్మించాలని, దిగువన మార్కెట్‌.. పై అంతస్తులో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మార్కెట్‌ను అక్కడి నుంచి సమీపంలోని మైదానంలోకి షిఫ్ట్‌ చేసింది. దీన్ని ఏడాదిన్నరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

పూర్వ వైభవం తెస్తాం..  
నిజాం పాలన హయాంలో నిర్మించిన కట్టడాలకు పూర్వ వైభవం తేవడానికి ప్రణాళిక రూపొంచింది. చారిత్రక కట్టడాల వారసత్వ సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిపుణుల సలహాలు, సూచనలతో ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం. తొలుత ముర్గీచౌక్‌ నిర్మాణ పనులు ప్రారంభించాం. మీరాలంమండి, సర్దార్‌ మహల్‌ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. 
–  బాదావత్‌ సంతోష్‌, కుడా అడ్మినిస్ట్రేటర్‌ 

గడువులోగా పనులు పూర్తి చేస్తాం..   
ముర్గీచౌక్‌ మార్కెట్‌ పనులు ప్రాంభమయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్‌లోని వ్యాపారులను సమీప మైదానంలోకి తరలించాం. టెండర్‌ ప్రక్రియ ద్వారా పనులను కేటాయించాం. ఉన్నత అధికారుల ఆదేశాలు.. ప్లాన్‌ ప్రకారం పనులు అయ్యే విధంగా ప్రణాళికాబద్ధంగా పనులు చేయిస్తున్నాం. నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం.   
– జి.గురువీర, కుడా సెక్రటరీ, చీఫ్‌ ఇంజినీర్‌
చదవండి: తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను?

మరిన్ని వార్తలు