111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?

17 May, 2022 18:26 IST|Sakshi

కాలుష్యం పెరిగే ప్రమాదం.. 

పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికుల ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: సుదూర ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు ఏటా వలస వచ్చే రాజహంసలు.. బాతులు.. కొంగలు.. గోరింకలు.. డేగలు తదితర పక్షుల జాడ క్రమంగా కనుమరుగు కానుందా? జీవో 111 ఎత్తివేతతో సుందర జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, కాంక్రీట్‌ మహారణ్యం పెరిగి.. శబ్ద, వాయు కాలుష్యం, పక్షుల సహజ ఆవాసాలైన జలాశయాలను కాలుష్య కాసారంగా మార్చేయనుందా? ఈ ప్రశ్నలకు పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికులు అవుననే సమాధానమిస్తున్నారు.  
 
► సైబీరియా.. యూరప్‌.. ఆఫ్రికా.. మయన్మార్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ తదితర దేశాల నుంచి జంట జలాశయాలకు ఏటా అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వేలాదిగా విభిన్న రకాల పక్షి ప్రజాతులు తరలివస్తాయి. హిమాయత్‌సాగర్‌కు సుమారు 200 వరకు గుజరాత్‌ నుంచి రాజహంసలు వలస రావడం పరిపాటే. మొత్తంగా ఈ జలాశయానికి 52 రకాలు, ఉస్మాన్‌సాగర్‌కు 92 రకాల పక్షి జాతులు వలస వస్తాయి.  

► జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడిన పక్షంలో వలస పక్షులకు సమీప భవిష్యత్‌లో గడ్డు పరిస్థితులు తప్పవని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.  విభిన్న రకాల గోరింక ప్రజాతులకూ ఇక్కట్లేనని చెబుతున్నారు. సుమారు పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వలసవచ్చే బార్‌హెడ్‌గూస్‌ (బాతు) జాడ కూడా కనిపించదని స్పష్టం చేస్తున్నారు. ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చే పైడ్‌ క్రస్టెడ్‌ కకూ అనే పక్షి రాక ఉండదని చెబుతున్నారు. 
 
వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే:  
గుజరాత్‌ రాజహంసలు (గ్రేటర్‌ ఫ్లెమింగోలు), పిన్‌టెయిల్డ్‌ డక్‌(బాతు), షౌలర్,గార్గినే టేల్, హ్యారియర్స్‌ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్‌లింక్స్, భార్మెడోగూస్‌ బాతు, పైడ్‌ క్రస్టడ్‌ కకూ వీటిలో ప్రధానంగా కొంగలు, బాతులు, డేగలు, గుడ్లగూబలు, నీటికోళ్లు తదితర జాతులున్నాయి. (క్లిక్‌: ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్‌బుక్‌లో  పోస్టు చేస్తూ..)

నగరీకరణ, కాలుష్యం పెరిగితే కష్టమే 
జంటజలాశయాల చుట్టూ సమీప భవిష్యత్‌లో పట్టణీకరణ ప్రభావం, శబ్ద, వాయు కాలుష్యాలకు అవకాశం ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చే పక్షిజాతుల జాడ కనిపించదు. జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది.   
– డాక్టర్‌ శ్రీనివాసులు, ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం    

మరిన్ని వార్తలు