ఓ వైపు వర్షం, నిర్లక్ష్యం వహిస్తే.. కొంపలు మునుగుతాయ్‌ సారు

20 Jul, 2021 08:55 IST|Sakshi

కాలువల ఆక్రమణలను తొలగించని అధికారులు 

కట్ట లీకేజీలు, బలహీనంగా తూములకు మరమ్మతుల చేపట్టని వైనం 

అలుగు పారుతున్న చెరువులు

లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ప్రమాదం 

సాక్షి, హయత్‌నగర్‌( హైదరాబాద్‌): నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలకు హయత్‌నగర్‌లోని పలు కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే. శనివారం మరో మరోసారి భారీ వర్షం కురవడంతో ఫైర్‌స్టేషన్, బస్‌ డిపోల్లోకి నీరు చేరింది. అదే విధంగా కుమ్మరికుంట నిండి పొంగిపొర్లి దిగువనున్న బాతుల చెరువులోకి భారీగా నీరు చేరుతోంది. బాతుల చెరువు సైతం శనివారం అర్ధరాత్రి నుంచి అలుగు పారుతోంది. 

ఏ క్షణమైన కాలనీలను ముంచెత్తే ప్రమాదం
►  నీటి ప్రవాహం పెరిగితే ఏ క్షణమైనా అలుగు నీరు కింది కాలనీలను మంచెత్తే ప్రమాదం ఉంది. అదే జరిగితే బాతుల చేరువు కట్ట కింద ఉన్న కాలనీలు మరోసారి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఎగువనున్న కాప్రాయ్‌ చెరువు ఏ క్షణమైనా అలుగు పారవచ్చు. అదే జరిగితే ఇప్పటికే నిండి పొంగిపొర్లుతున్న కుమ్మరికుంటలోకి ఆ నీరు వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి వరద నీరు నేరుగా బాతుల చెరువులోకి చేరుతుంది.  ఈ మూడు చెరువుల నీటితో పాటు నిండు కుండలా ఉన్న మాసబ్‌ టాంక్‌ చెరువు కూడా అలుగు పారేందుకు సిద్ధంగా ఉంది. ఆ చెరువు అలుగు పారితే రెండు వైపుల నీరు మంజారా కాలనీ, అంబేడ్కర్‌నగర్‌లలోకి వస్తుంది. ఇదే జరిగితే ఆయా కాలనీల ప్రజలు పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 
► బాతుల చెరువు అలుగు ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండటంతో దిగువనున్న వసుందర కాలనీ, కట్టమైసమ్మకాలనీ, తిరుమలకాలనీ, ఆ ర్టీసీ మజ్దూర్‌కాలనీతో పాటు అంబేడ్కర్‌నగర్, రంగనాయకుల గుట్ట, బీజేఆర్‌ కాలనీ, బంజారా కాలనీలలోకి నీరు చేరుతోంది. గత అక్టోబర్‌లో వర్షాలకు ప్రజలు నిరాశ్రయులైన సంఘటన మరువక ముందే మరోసారి ముంపు ప్రమా దం పొంచి ఉండటంతో బిక్కుబిక్కుమంటున్నారు.

► చెరువులు నిండినప్పుడు అలుగు నీరు వెళ్లేందుకు గతంలో ఉన్న కాలువలు ఆక్రమణలకు గురి కావడంతో అలుగు నుంచి వచ్చే నీటికి దారి లేక కాలనీలను మంచెత్తుతోంది. గత అక్టోబర్‌లో వచ్చిన వరద సమయంలో కాలవల ఆక్రమణలను తొలగిస్తామన్నారు. కాలువలను పునరుద్ధరిస్తామని అధికారులు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఈ వర్షాకాలంలో వరదలు వస్తే గతేడాది పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
► మరోసారి బాతుల చెరువు పొంగితే మా గతి ఏంటని లోతట్టు ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. వరద ప్రవాహం ఎప్పుడు తమను మంచెత్తుతుందో అని వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. రానున్న ప్రమాదాన్ని గుర్తించి అధికారులు మందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

కట్టలకు మరమ్మతులు ఏవి?
► గతేడాది కురిసిన వర్షాలకు కుమ్మరికుంట కోతకు గురై కట్ట బలహీనంగా మారింది. దానికి తాత్కాలిక మరమ్మతులు చేసిన అధికారులు తిరిగి అటువైపు చూడలేదు. బాతుల చెరువు నిండి ప్రమాదకర స్థాయిలో వరద రావడంతో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఆ చెరువుకట్ట బలహీనంగా మారింది.  
► గత కొంత కాలంగా కట్టకు లీకేజీలు ఏర్పడి నీరు కిందికి వెళ్తోంది. తూములకు కూడా మరమ్మతులు చేయకపోవడంతో వాటి నుంచి కూడా నీరు దిగువకు వెళ్తోంది. ఇప్పటి వరకు కట్ట లీకేజీలను అరికట్టేందుకు, తూములకు మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. 

కంటిమీద కునుకు లేదు..
వర్షం వస్తుందంటే కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఏ క్షణంలో వరద ముంచెత్తుతుందోనని భయంగా ఉంది. బాతుల చెరువు అలుగు నీరు నేరుగా మా కాలనీ గుండా వెళ్తోంది. అలుగు నీరు వస్తుండటంతో ఇళ్ల నుంచి నుంచి బయటికి కూడా రాలేకపోతున్నాం.
    – రాములు, కట్టమైసమ్మ కాలనీ
భయంగా ఉంది..
బాతులు చెరువు అలుగు పారుతుండటంతో ఏ క్షణంలో వరద నీరు మంచెత్తుతందోనని భయంగా ఉంది. గత అక్టోబర్‌లో వచ్చిన వరదకు ఇళ్లు మునగడంతో పైకప్పు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాం. అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. ఇప్పుడు ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
    – బాబూలాల్, రంగనాయకుల గుట్ట

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు