బోసిపోయిన భాగ్యనగరం..నిర్మానుష్యంగా మారిన రహదారులు

15 Jan, 2023 08:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరం ఖాళీ అయింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు వెళ్లిపోయారు. వ్యక్తిగత వాహనాలు, బస్సులు, ప్రైవేట్‌ వాహనాలలో పయనమయ్యారు. దీంతో ఔటర్, జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, వరంగల్‌ హైవేలలోని టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం భోగి కావటంతో గురు, శుక్రవారాల్లో నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు వెళ్లారు.

12, 13 తేదీలలో రెండున్నర లక్షల పైనే వాహనాలు ఆయా హైవేలలోని టోల్‌గేట్లను దాటాయని ట్రాఫిక్‌ పోలీసులు అంచనా వేశారు. 1,49,403 వాహనాలు విజయవాడ హైవేలోని పంతంగి, వరంగల్‌ హైవేలోని బీబీనగర్‌ టోల్‌ప్లాజాలను దాటివెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఇందులో 1,14,249 వాహనాలు కార్లే కావటం గమనార్హం. ఈ రెండు రోజులలో 1,24,172 వాహనాలు విజయవాడ హైవేలోనే ప్రయాణించాయని పోలీసులు తెలిపారు. అలాగే వరంగల్‌ వైపు నుంచి హైదరాబాద్‌కు 13,334 వాహనాలు వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల మధ్య నగరవాసులు ఎక్కువగా వాహనాలలో ప్రయాణించారు.  

ప్రత్యేక బృందాలతో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ 
హైవేలలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధికరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆరీ్టసీ, జీఎంఆర్‌ టోల్‌ నిర్వహణ బృందాలతో పనిచేస్తున్నాం. మెయిన్‌ రోడ్లలో వెళ్తున్న వారు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. 
– డి.శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్‌  

(చదవండి: ముగ్గుల ఫోటోలు తీస్తుండగా విషాదం..ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి..)

>
మరిన్ని వార్తలు