Hyderabad Speed Limit News: హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

26 May, 2022 14:51 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ రోడ్లపై వేగ పరిమితుల ఖరారు

డివైడర్‌ ఉన్న రోడ్లపై కార్ల గరిష్ట వేగం 60 కి.మీ.

మిగతావాటికి 50 కి.మీ. డివైడర్‌ లేకుంటే 50, 40గా నిర్ధారణ

నాలుగున్నరేళ్ల క్రితమే కమిటీల ఏర్పాటు

ఇంతకాలం తర్వాత ఖరారు ప్రకటిస్తూ ఉత్తర్వు జారీ 

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో రోడ్లపై వాహనాల వేగంపై ప్రభుత్వం పరిమితి విధించింది. దీనికి సంబంధించి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వేగ పరిమితిని ఖరారు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కార్లు– ఇతర వాహనాలను (సరుకు రవాణా వాహనాలు, బస్సులు, మూడు చక్రాల వాహనాలు, ద్విచక్రవాహనాలు) రెండు కేటగిరీలుగా విభజించి వేరువేరు వేగ పరిమితులను ఖరారు చేసింది.  

► డివైడర్‌లతో ఉన్న రోడ్లు, డివైడర్‌లు లేని రోడ్లు, కాలనీ రోడ్లు.. ఇలా మూడు వేర్వేరు రోడ్లకు వేర్వేరు గరిష్ట వేగాలను ఇందులో పేర్కొనటం విశేషం.

► ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగి మరణాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు తెలుస్తోంది.

► రోడ్డు డివైడర్‌ ఉన్న రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 60 కి.మీ.గా, ఇతర వాహనాల వేగం 50 కి.మీ.గా నిర్ధారించారు.

► డివైడర్‌ లేని రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.గా, ఇతర వాహనాల వేగం 40 కి.మీ.గా, కాలనీ రోడ్లపై కార్లు, ఇతర వాహనాల గరిష్ట వేగం 30 కి.మీ.గా ఖరారు చేసింది.  


నాలుగున్నరేళ్ల తర్వాత.. 

ఆధునిక వాహనాలు అందుబాటులోకి రావటంతో రోడ్లపై వాటి వేగం పెరిగి ప్రమాదాలు చోటుచేసుకోవటం ద్వారా విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్న తీరును 2017లో హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, నగర, పట్టణ రోడ్లపై వాహనాల గరిష్ట వేగంపై పరిమితి విధించాలని ఆయన అందులో ప్రభుత్వాన్ని కోరారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ఆయా రోడ్లపై వేగ పరిమితిని నిర్ధారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు 2017 నవంబరు 17న ఉత్తర్వు జారీ చేసింది. 
    

జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రోడ్లు, పురపాలక సంఘాల రోడ్లపై వేగ పరిమితిని నిర్ధారించే బాధ్యతను ఆయా విభాగాల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు అప్పగించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆ సంస్థ ఎస్‌ఈకి అప్పగించింది. దీనికి సంబంధించి ఆయా అధికారులు కసరత్తులు పూర్తి చేసి ఎక్కడికక్కడ నివేదికలు సమర్పించారు. ఇంతకాలానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారుల సిఫారసు ఆధారంగా వేగ పరిమితిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇక జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, పురపాలక రోడ్లకు సంబంధించి అధికారుల సిఫారసుల ఆధారంగా పరిమితులు అమలులోకి వస్తాయని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. (క్లిక్‌: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. అరుదైన ఘనతలు)


మరింత స్పష్టత కావాలి.. 

ఈ వేగాలకు సంబంధించి మరింత స్పష్టత అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డివైడర్‌ ఉన్న రోడ్లపై గరిష్ట వేగాన్ని కార్లకు 60గా నిర్ధారించినా, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రార్థనా సంస్థలు, మార్కెట్ల చేరువలో అది సాధ్యం కాదని, అలాంటి వాటిపై మరింత స్పష్టత ఉండాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, పురపాలిక రోడ్లకు సంబంధించి, ఆయా ప్రాంతాల పరిస్థితుల ఆధారంగా ప్రతి రోడ్టుపై వేగ పరిమితిని ప్రకటించాలని వారు కోరుతున్నారు.  (క్లిక్‌: ఏఐతో ‘రాస్తే’ సేఫ్‌.. పనిచేస్తుందిలా!)

మరిన్ని వార్తలు