Hyderabad Regional Ring Road: ‘రీజినల్‌’ రెండో గెజిట్‌ విడుదల.. అభ్యంతరాలకు 21 రోజుల గడువు

22 Apr, 2022 08:43 IST|Sakshi

యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లో భూసేకరణ వివరాలు వెల్లడించిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి సంబంధించి రెండో గెజిట్‌ విడుదలైంది. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంపీటెంట్‌ అథారిటీలోని 8 మంది అధికారులకుగాను ముగ్గురు అధికారుల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లను పేర్కొంటూ 3 (క్యాపిటల్‌ ఏ)గా పిలిచే ఈ గెజిట్‌ను గురువారం కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

యాదాద్రి–భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్, అదే జిల్లా పరిధిలోని చౌటుప్పల్‌ ఆర్‌డీవో, సంగారెడ్డి జిల్లా అందోల్‌–జోగిపేట ఆర్డీఓల పరిధిలోని 31 గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లు, దాని పరిధిలో సేకరించాల్సిన భూముల విస్తీర్ణాన్ని ఇందులో పేర్కొన్నారు. సేకరించే భూమిలో 617 హెక్టార్లకు సంబంధించిన సర్వే నంబర్ల వివరాలను ఈ గెజిట్‌లో పొందుపరిచారు. కంపీటెంట్‌ అథారిటీలో భాగంగా ఉన్న యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్‌ పరిధిలోని గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వెలుపుపల్లె, మల్లాపూర్, దత్తార్‌పల్లె గ్రామాలకు సంబంధించి 208.6090 హెక్టార్ల భూమిని సమీకరించనున్నట్లు గెజిట్‌లో వివరించారు.
చదవండి👉🏼 మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు..

అలాగే సంగారెడ్డి జిల్లా అందోల్‌–జోగిపేట ఆర్డీఓ పరిధిలోని శివ్వంపేట, వెండికోల్, వెంకటకిష్టాపూర్‌ (అంగడి), లింగంపల్లి, కోర్పోల్‌ గ్రామాలకు సంబంధించి 108.9491 హెక్టార్ల భూమిని సమీకరించనున్నారు. ఇక చౌటుప్పల్‌ ఆర్డీఓ పరిధిలోని చిన్నకొండూరు, వెర్కట్‌పల్లె, గోకారం, పొద్దటూరు, వలిగొండ, సంగం, చౌటుప్పల్, లింగోజీగూడెం, పంతంగి, పహిల్వాన్‌పూర్, కంచెన్‌పల్లె, టేకులసోమారం, రెడ్లరాపాక, నేలపట్ల, తల్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగేడుపల్లె గ్రామాలకు సంబంధించి 300.3820 హెక్టార్ల భూమిని సమీకరించనున్నారు.  

అభ్యంతరాలకు 21 రోజుల గడువు.. 
విడుదలైన ముగ్గురు కంపీటెంట్‌ అధికారుల అధీనంలోని ప్రాంతాల ప్రజలు పత్రికాముఖంగా గెజిట్‌ ప్రచురితమైన రోజు నుంచి 21 రోజుల్లోపు అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలపై సమాధానాలు వెలువడ్డ తర్వాత రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల నిడివి ఎక్కడ ఉండనుందో రెవెన్యూ అధికారులు హద్దులు గుర్తించి రాళ్లు పాతనున్నారు. దీన్ని డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం పరికరాల శాటిలైట్‌ శాస్త్రీయ సర్వేతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 

నెల తర్వాత 3డీ గెజిట్‌.. 
గ్రామాలవారీగా భూసమీకరణ జరిగే సర్వే నంబర్లను రెండో గెజిట్‌లో పొందుపరచగా ఈ సర్వే నంబర్‌లో ఎంత భూమి సేకరించనున్నారో, దాని యజమాని ఎవరో స్పష్టం చేసే 3డీ గెజిట్‌ మరో నెల రోజుల తర్వాత విడుదల కానుంది.
చదవండి👉🏼 సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

మరిన్ని వార్తలు