Hyderabad Regional Ring Road: ఇంటర్‌ ఛేంజర్లతో ఇక్కట్లు!

12 Oct, 2022 03:06 IST|Sakshi
రాయగిరి వద్ద నిర్మించే ఇంటర్‌ ఛేంజర్‌ డబుల్‌ ట్రంపెట్‌ నమూనా 

రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగంలో 11 చోట్ల ఇంటర్‌ ఛేంజర్లు

వీటిపై తీవ్రస్థాయిలో స్థానిక ప్రజల అభ్యంతరాలు 

ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు వందల సంఖ్యలో వినతులు 

ఇంటర్‌ ఛేంజర్ల మధ్యలో రైస్‌ మిల్లులు, పెట్రోల్‌ బంకులు వంటి ప్రైవేటు భవనాలు ఉండటమే కారణం 

డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజర్లున్న చోట ప్రైవేటు నిర్మాణాలను యజమానులు వాడుకునే అంశాన్ని పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ 

రెండు చోట్లే డబుల్‌ ట్రంపెట్లు.. మిగతా 9 ప్రాంతాల్లో తొలగించాల్సిందే 

ఊళ్లకు దూరంగా వచ్చేలా అలైన్‌మెంట్‌ మార్చాలని వినతులు

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు సంబంధించిన ఇంటర్‌ ఛేంజర్ల (జంక్షన్లు) నిర్మాణం ఆయా ప్రాంతాల ప్రజలను కలవరానికి గురిచేస్తుంటే.. ఇంటర్‌ ఛేంజర్లపై ప్రజల అభ్యంతరాలు అధికారులకు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. చుట్టూ ఇంటర్‌ ఛేంజర్‌ నిర్మాణం..మధ్యలో కొన్ని మిల్లులు, దుకాణాలు, పెట్రోలు పంపులు.. వంటి వాణిజ్యపరమైన ప్రైవేటు నిర్మాణాలు, ఇళ్లు సైతం ఉండటం సమస్యగా మారింది. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంలో భాగంగా ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలు తొలగించాల్సి రావటం ఇప్పుడు చాలా కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది.  

భూసేకరణ ప్రక్రియ షురూ.. 
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చిక్కులను కొంతమేర తగ్గించే క్రమంలో ప్రతిపాదించిన రీజినల్‌ రింగురోడ్డు భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ఉత్తర భాగానికి సంబంధించిన 162 కి.మీ. రోడ్డుకు గాను భూసేకరణకు మార్గం సుగమం చేస్తూ 3ఏ గెజిట్‌ నోటిఫికేషన్లు అన్నీ విడుదలయ్యాయి. అభ్యంతరాల గడువు కూడా పూర్తి కావటంతో ఇక భూమిని సేకరించే పని మొదలైంది. దీనికి సంబంధించి సర్వే కూడా ఇటీవలే పూర్తి చేశారు. రోడ్డు అలైన్‌మెంట్‌ విషయంలో రాయిగిరి, సంగారెడ్డిలాంటి ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఆయా ప్రాంతాల్లో 30 కి.మీ.కు సంబంధించిన సర్వేను అధికారులు పెండింగులో పెట్టారు. ఆయా ప్రాంతాల్లో భూ యజమానులను ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కుదరని పక్షంలో చివరి అస్త్రంగా పోలీసు రక్షణ మధ్య భూమిపై హద్దులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.  

ఇంటర్‌ ఛేంజర్లపై తీవ్ర అభ్యంతరాలు 
జాతీయ, రాష్ట్ర రహదారులను రీజినల్‌ రింగురోడ్డు దాటే ప్రాంతాల్లో నిర్మించాల్సిన ఇంటర్‌ ఛేంజర్లపై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి సంబంధించి వందల్లో వినతులు ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు చేరాయి. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు రెండు ఇంటర్‌ ఛేంజర్ల విషయంలో మాత్రం ప్రైవేటు నిర్మాణాలను వాటి యజమానులు వినియోగించుకునేలా అవకాశం కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మిగతా వాటి విషయంలో మాత్రం కచ్చితంగా ఆయా నిర్మాణాలను తొలగించాల్సిందేనన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు.

డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజర్స్‌ వద్ద వెసులుబాటు? 
రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగంలో 11  ప్రాంతాల్లో ఇంటర్‌ ఛేంజర్లు నిర్మించాల్సి ఉంది. హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద డబుల్‌ ట్రంపెట్‌ (గుండ్రంగా ఉండే రెండు నిర్మాణాలు) నమూనాలో ఇంటర్‌ ఛేంజర్‌ నిర్మించాల్సి ఉండగా..ఆ భూమి పరిధిలో రైస్‌ మిల్లులున్నాయి. ఇక జోగిపేట రోడ్డులో మరో డబుల్‌ ట్రంపెట్‌ నిర్మాణం రానుంది. ఇక్కడ పెట్రోలు బంకు వస్తోంది.

అయితే ఈ రెండూ డబుల్‌ ట్రంపెట్‌ నిర్మాణాలైనందున, స్ట్రక్చర్‌ లూప్‌లో ఒకవైపు మాత్రమే రోడ్డు ఉండి, మిగతా మూడు వైపులా ఖాళీగా ఉంటుంది. ఆ లూప్‌ ఎలివేటెడ్‌ స్ట్రక్చర్‌ (వంతెన లాంటి నిర్మాణం) కావటంతో కింది నుంచి మిల్లులు, పెట్రోల్‌ బంకు వంటి ప్రైవేటు నిర్మాణాలకు దారి ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో ఈ రెండుచోట్లా ప్రైవేటు నిర్మాణాలను వాటి యజమానులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వాడుకునేలా వెసులుబాటు కల్పించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మిగతా చోట్ల డబుల్‌ ట్రంపెట్‌ నమూనాలు లేనందున, మధ్యలో ఉండే ప్రైవేటు నిర్మాణాలకు దారి ఏర్పాటుకు అవకాశం ఉండదు. 

యజమానుల్లో ఆందోళన 
డబుల్‌ ట్రంపెట్లు కాని 9 ప్రాంతాల్లో రెండు చోట్ల పెట్రోలు బంకులు, దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటికి అప్రోచ్‌ రోడ్డు ఏర్పాటుకు సాధ్యం కాదని అధికారులంటున్నారు. దాంతో వాటి యజమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఊళ్లకు కొంచెం దూరంగా అలైన్‌మెంట్‌ మార్చి ఖాళీ ప్రాంతాల్లో జంక్షన్లు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అయితే రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారైనందున జంక్షన్లను మార్చటం సాధ్యం కాదని, ఒకవేళ మార్చాలంటే మరో 10 కి.మీ. దూరం నుంచి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అప్పుడు రోడ్డు నిర్మాణానికి మరింత భూసేకరణ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. (క్లిక్ చేయండి: ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగం భూసేకరణ సర్వే పూర్తి.. ఆ రెండు చోట్ల మాత్రం!)

మరిన్ని వార్తలు