Hyderabad: చెత్త వ్యాపారి వద్ద రూ.1.24 కోట్లు.. అంత డబ్బు ఎక్కడిది?

30 Sep, 2022 07:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జల్‌పల్లికి చెందిన ఓ స్క్రాప్‌ వ్యాపారి వద్ద సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రూ.1.24 కోట్లు స్వాధీనం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తన సమీప బంధువు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని ఒకరి నుంచి తీసుకున్న ఇతగాడు మరో నలుగురికి అందించేందుకు ప్రయత్నించాడని ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. మీరట్‌ నుంచి నగరానికి వలసవచ్చిన షోయబ్‌ మాలిక్‌ మాసబ్‌ట్యాంక్‌లో ఉంటున్నాడు. గతేడాది ఫిబ్రవరి నుంచి జల్‌పల్లిలో బిస్మిల్లా ట్రేడర్స్‌ పేరుతో స్క్రాప్‌ వ్యాపారం చేస్తున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న ఇతడి సమీప బంధువు కమిల్‌ మాలిక్‌ గుజరాతీ గల్లీ ప్రాంతానికి చెందిన వ్యాపారి భరత్‌ నుంచి రూ.1.24 కోట్లు తీసుకోమని చెప్పాడు. దీంతో గురువారం తన వద్ద పని చేసే ఉద్యోగి అక్లాక్‌ను పంపి డబ్బు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని కమిల్‌ ఆదేశాల మేరకు నగరానికే చెందిన సంభవ్, ఆదిల్, మినాజ్, షఫీలకు అందించాలని భావించాడు.


సీజ్‌ చేసిన డబ్బు

దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.రఘునాథ్‌ నేతృత్వంలో ఎస్సై ఎస్‌.సాయికిరణ్‌ నేతృత్వంలోని బృందం దాడి చేసి అదుపులోకి తీసుకుంది. షోయబ్‌ సహా అతడి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.1.24 కోట్ల నగదును హుమాయున్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారం హవాలా దందాగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆదాయపుపన్ను శాఖకు సమాచారం ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు