60 శాతం బస్సులు మేడారానికే.. సిటీలో కష్టాలు.. ప్రత్యామ్నాయమేదీ?  

18 Feb, 2022 10:25 IST|Sakshi

ఆర్డినరీ బస్సులు లేక ప్రయాణికుల పడిగాపులు

మెట్రోల్లో పాస్‌లు చెల్లక విద్యార్థుల ఇక్కట్లు

అరకొర సర్వీసులతో నగరవాసుల అగచాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: సిటీ బస్సులు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. సకాలంలో అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజులుగా సిటీ ఆర్డినరీ బస్సులను మేడారం జాతరకు తరలిస్తున్నారు. దీంతో నగరంలో ట్రిప్పులు  గణనీయంగా తగ్గాయి. ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కాలేజీలకు  వెళ్లే సమయంలో తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు ఉండడం లేదు. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్‌లు కేవలం ఆర్డినరీ బస్సులో మాత్రమే చెల్లుబాటవుతాయి. మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌లలో వీరి పాస్‌లకు అనుమతి ఉండదు. ఆర్డినరీ బస్సులు లేకపోవడంతో మెట్రోల్లో చార్జీలు చెల్లించాల్సివస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఆర్డినరీ పాస్‌లపై రాకపోకలు సాగించే సాధారణ ఉద్యోగులు సైతం ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. 

60 శాతం బస్సులు అక్కడికే.. 
► గ్రేటర్‌ పరిధిలో సుమారు 2,850 బస్సులు ఉన్నాయి. రోజుకు 20 వేలకు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. 25 లక్షల మంది  ప్రయాణికులు సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. ప్రస్తుతం 60 శాతం బస్సులను మేడారం జాతరకు తరలించారు. జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలోని డిపోలను  ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిపోలతో అనుసంధానం చేశారు. దీంతో సిటీ డిపోల్లో బస్సుల నిర్వహణ ప్రస్తుతం వరంగల్‌  అధికారుల పర్యవేక్షణలో ఉంది.  

► అధికారులను, సిబ్బందిని సైతం పెద్ద ఎత్తున మేడారంలో మోహరించారు. 3,845  బస్సులను మేడారం జాతర కోసం  ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో సిటీలో బస్సుల కొరత ఏర్పడింది. ఇది తాత్కాలికమే అయినా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బస్‌పాస్‌లు ఉన్న వారు చార్జీలు చెల్లించి మెట్రో బస్సుల్లో ప్రయాణం చేయాల్సివస్తోంది.  

ప్రత్యామ్నాయమేదీ?  
► గ్రేటర్‌లో సుమారు 5 లక్షల స్టూడెంట్‌ పాస్‌లు ఉన్నాయి.1.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఉచిత పాస్‌లపై ఆర్డినరీ బస్సుల్లో స్కూళ్లకు వెళ్తున్నారు. పదో తరగతి వరకు అమ్మాయిలకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. 

► కాలేజీలకు వెళ్లే విద్యార్థులంతా రూట్‌ పాస్‌లు, నెలవారీ బస్‌పాస్‌లపై వెళ్తున్నారు. ఆర్డినరీ బస్సులను మేడారానికి  తరలించడంతో మెట్రో బస్సుల్లో వీటిని అనుమతించడం లేదు. హైదరాబాద్‌ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సుల్లోనూ అనుమతించడం లేదు.
► జాతర పూర్తయ్యే వరకు తమ బస్‌పాస్‌లను పల్లెవెలుగు, మెట్రో బస్సుల్లో  తాత్కాలికంగా అనుమతించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు