‘మహిళా ప్రత్యేకం’ ఇక బంద్‌

8 Mar, 2021 10:52 IST|Sakshi

మహిళా ప్రయాణికుల బస్సుల నిలిపివేత

గ్రేటర్‌లో 20 రూట్లలో 45 ప్రత్యేక సర్వీసులు

కోవిడ్‌ అనంతరం పునరుద్ధరించని ఆర్టీసీ

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగినులకు ఇబ్బందులు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో లేడీస్‌ స్పెషల్‌ బస్సులకు బ్రేక్‌ పడింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగుల కోసం ఎంతో ప్రత్యేకంగా నడిపిన లేడీస్‌ స్పెషల్‌ బస్సులను ఆర్టీసీ నిలిపివేసింది. దశాబ్దాలుగా మహిళలకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఈ బస్సులను మొట్టమొదటిసారి ఆపేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల నడలింపు అనంతరం దశలవారీగా అన్ని బస్సులను రోడ్డెక్కించినప్పటికీ లేడీస్‌ స్పెషల్స్‌ను మాత్రం పునరుద్ధరించలేదు. కోవిడ్‌కు ముందు నగరంలోని 20 ప్రధాన రూట్లలో ప్రతిరోజూ సుమారు 45 స్పెషల్‌ బస్సులను నడిపేవారు. మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రోజుకు 100 ట్రిప్పుల వరకు తిరిగేవి. ఉద్యోగినులు సకాలంలో కార్యాలయాలకు వెళ్లేవారు. ప్రస్తుతం నగరంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్నా ప్రత్యేక బస్సులను నడపకపోవడంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు.  

10 లక్షల మంది మహిళా ప్రయాణికులు
►ముంబై, బెంగళూర్‌ వంటి మెట్రో నగరాల్లో మహిళల కోసం ప్రత్యేక రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. కోవిడ్‌ కాలానికి ముందు వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లలో మహిళల కోసం ప్రత్యేక బోగీలు ఉండేవి. ప్రత్యేకంగా ‘మాతృభూమి’ ఎంఎంటీఎస్‌ నడిచేది.  
► ప్రస్తుతం ఏడాది కాలంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు నిలిచిపోయాయి. మెట్రో రైళ్లలో మాత్రం మహిళల కోసం ప్రత్యేక బోగీలను ఏర్పాటు చేశారు. కానీ అతిపెద్ద ప్రజారవాణా సంస్థ అయిన గ్రేటర్‌ ఆర్టీసీ మాత్రం మహిళా ప్రయాణికులను విస్మరించింది.  
► రోజుకు 25 లక్షల మంది సిటీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుండగా కనీసం 10 లక్షల మందికిపైగా మహిళా ప్రయాణికులు ఉన్నారు. వీరి కోసం ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న బస్సు సర్వీసులను నిలిపివేయడం శోచనీయం.

కరువైన ఊరట..   
► వనస్థలిపురం, దీని పరిసర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది మహిళలు నాంపల్లి, లక్డికాపుల్, హైకోర్టు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు. 
► నాగారం, కుషాయిగూడ, ఈసీఐఎల్‌ ప్రాంతాల నుంచి డీజీపీ కార్యాలయానికి లేడీస్‌ స్పెషల్‌ బస్సులు అందుబాటులో ఉండేవి.  
► బీఆర్‌కే భవన్, గాందీభవన్, ఎండోమెంట్‌ ఆఫీస్, కో ఆపరేటివ్‌ ఆఫీస్‌ వంటి పలు  ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసేవాళ్లు  ప్రత్యేక బస్సుల్లో  పయనించేవారు.  
► ఉదయం, సాయంత్రం  బస్సులు అందుబాటులో ఉంటాయనే భరోసా ఉండేది. కానీ సాధారణ బస్సులు, ఆటోల్లో వెళ్లాల్సివస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు