ఆడుకుంటూనే  అనంత లోకాలకు

6 Aug, 2021 07:39 IST|Sakshi

గేటు మీదపడి ఆరేళ్ల బాలుడి మృతి  

సాక్షి, గచ్చిబౌలి( హైదరాబాద్‌): అప్పటిదాకా తమ కళ్ల ఎదుటే ఇంట్లో తిరిగిన చిన్నారి కాసేపటికే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆడుకుంటుండగా దిమ్మె కూలి గేటు మీద పడటంతో దుర్ఘటనలో ఆరేళ్ల బాలుడు అసువులు బాశాడు. ఈ విషాదకర ఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నవీన్‌ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు.. మహారాష్ట్రకు చెందిన దంపతులు రాహుల్‌ సూర్యవంశీ, మీనా సూర్యవంశీ గోపన్‌పల్లిలో జర్నలిస్ట్‌ కాలనీని ఆనుకొని ఉన్న వివేకానందనగర్‌ (60 గజాల సైట్‌)లో నివాసం ఉంటున్నారు.

వీరికి నితేష్‌ (6), రూపేష్‌ కవల కుమారులతో పాటు కూతురు స్నేహ ఉన్నారు. రాహుల్‌ కన్సాలిడేటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.  గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయంలో రెండో తరగతి చదువుతున్న నితేష్‌ ఆన్‌లైన్‌ క్లాసులు ముగియడంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న ప్లాట్‌ నంబర్‌ 125 గేటుకు వేలాడుతూ ఆడుకుంటున్నాడు. దిమ్మె కూలడంతో ఒక్కసారిగా ఇనుప గేటు మీద పడింది. దీంతో బాలుడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కూలిన శబ్దం విని తల్లి మీనా పరుగున వెళ్లి ఇరుగుపొరుగువారి సహాయంతో బయటకు తీశారు. వెంటనే ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు నితేష్‌ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు