8 జన్యువులతో సంతాన లోపాలు.. పురుషుల్లోని సమస్యలే కారణం.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

8 Sep, 2022 13:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలోని పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఎనిమిది ప్రత్యేక జన్యువులు ప్రభావి­తం చేస్తున్నాయని సెంటర్‌ ఫర్‌ సెల్యు­లార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ఎనిమిది జన్యువుల్లో జరుగుతున్న మార్పు­లు వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపి, పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతోందని తేల్చారు. ఈ వివరాలను సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయగ్నస్టిక్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.తంగరాజ్‌ వెల్లడించారు.

సంతానం కలగకపోవడానికి సగం కారణం పురుషుల్లోని సమస్యలే­నని.. పిల్లలు పుట్టకపోతే మహిళల­ను నిందించడం సరికాదని స్పష్టం చేశారు. జన్యుమార్పులు వంధ్య­త్వానికి దారితీస్తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో.. ఈ సమస్య పరిష్కారం కోసం మెరుగైన పద్ధతుల ఆవిష్కరణకు వీలవుతుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌ నందికూరి తెలిపారు.

దీర్ఘకాలం నుంచి పరిశోధనలు..: దేశంలోని పురు­షుల్లో వంధ్యత్వ సమస్యకు కారణాలను తెలుసుకునేందుకు డాక్టర్‌ తంగరాజ్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. గతంలోనూ వంధ్యత్వ సమస్య ఉన్న పురుషుల్లో 38శాతం మంది వై క్రోమోజోమ్‌లో తేడాలున్నట్టు వీరు గుర్తించారు. దీనితోపాటు కణాల్లోని మైటోకాండ్రియా, ఆటోసోమల్‌ జన్యువుల్లో మార్పులు కూడా వంధ్యత్వానికి కారణమవుతున్నట్టు తేల్చారు. తాజా పరిశోధనలో భాగంగా తాము వంధ్యత్వ సమస్య ఉన్న 47మందిలోని జన్యుక్రమాన్ని పరిశీలించామని తెలిపారు.

దేశవ్యాప్తంగా మరో 1,500 మంది వంధ్యత్వ పురుషుల్లోని జన్యుమార్పులతో పోల్చి చూశామని.. ఈ క్రమంలో ఎనిమిది ప్రత్యేక జన్యువుల సంగతి తెలిసిందని పరిశోధనలో భాగం వహించిన సీసీఎంబీ పీహెచ్‌డీ విద్యార్థి, ముంబై నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ రిప్రొడక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ శాస్త్రవేత్త సుధాకర్‌ దిగుమర్తి తెలిపారు. ఈ పరిశోధనలో బెంగళూరు జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌తోపాటు సికింద్రాబాద్‌లోని మమత ఫెర్టిలిటీ ఆస్పత్రి, సీడీఎఫ్‌డీ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయని వివరించారు. ఈ వివరాలు హ్యూమన్‌ మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


డాక్టర్‌ కె.తంగరాజ్‌

మరిన్ని వార్తలు