పీవీ మధ్యే మార్గమే దేశానికి రక్ష!

8 Jan, 2023 01:00 IST|Sakshi
‘మబ్బుల చాటున సూరీడు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సంజయ్‌ బారు. చిత్రంలో కె.రామచంద్రమూర్తి, పీవీ ప్రభాకర్‌రావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 

వాజ్‌పేయి, పీవీలు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు  

1990లో పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభావం 2000 నుంచి కనిపించింది. 

పీవీ స్మారకోపన్యాస కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సలహాదారు సంజయ్‌ బారు 

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయంగా భిన్న పార్టీలకు చెందిన వారైనప్పటికీ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయిలు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలని ప్రఖ్యాత జర్నలిస్టు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సలహాదారు సంజయ్‌ బారు అభిప్రాయడ్డారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది... అన్ని రంగాల్లోనూ ముందంజ వేసింది కూడా పీవీ, వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్‌ల ఏలుబడిలోనే అని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

పీవీ గ్లోబల్‌ ఫౌండేషన్‌ శనివారం ఏర్పాటు చేసిన పీవీ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1950ల నుంచి 2015 వరకూ దేశ ఆర్థికాభివృద్ధిని పరిశీలిస్తే.. 2000 – 2015 మధ్యకాలంలోనే సగటు ఆర్థికాభివృద్ధి అత్యధికంగా 7.5 శా తంగా నమోదైందని, ఈ కాలంలోనే దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2015 తరువాత వృద్ధి తిరోగమనంలో ఉందని, కోవిడ్‌–19 విజృంభించిన ఏడాది రుణాత్మక వృద్ధిని మినహాయిస్తే 2014– 2023 మధ్యకాలంలో సగటున 6 శాతం మాత్రమే వృద్ధి నమోదైందని చెప్పారు. 1990లో ప్రధానిగా పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభా వం 2000 సంవత్సరం నుంచి కనిపించడం మొదలైందని అన్నారు.  

మధ్యే మార్గంతో వృద్ధి పథంలోకి... 
1990 వరకూ దేశంలో పేరెన్నిక కంపెనీలంటే ఓ వందకు మించి ఉండేవి కాదని, టాటా, బిర్లాలు, మోడీ, గోయాంకా, సింఘానియా, థాపర్లు వంటి పేర్లే ప్రతి రంగంలోనూ వినిపించేవని సంజయ్‌ బారు గుర్తు చేశారు. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సరళీకరణ విధానాలను అవలంబించడం మొదలుపెట్టి.. పరిశ్రమల శాఖ మంత్రిగా వాటి అమల్లోనూ ముందున్న ఫలితంగా అంబానీలు మొదలుకొని మహింద్రా, ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్, టీవీఎస్‌ గ్రూపు వంటి దిగ్గజాలు ఎదిగాయని చెప్పారు. పీవీ ప్రధానిగా రోజుకో సవాలును ఎదుర్కొన్నా మధ్యే మార్గమన్న తారకమంత్రంతో వాటి ని అధిగమించారని రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ ఇదే రీతిన పాలన సాగిందని చెప్పారు.  

ఆధిపత్య రాజకీయాలతో చేటు...: పీవీ నరసింహరావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌లు భారత జాతీయత పునాదులను పటిష్టం చేయడం ద్వారా ఆర్థికంగాఎదిగేందుకు సాధికారికంగా మెలిగేందుకు కారణమయ్యారని స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక ఆధిపత్యభావజాలం ఈ దేశానికి గతంలోనూ నష్టం కలుగజేసిందని, ఇప్పుడు జరిగేది కూడా అదేనని, దేశ కీర్తిని గతంలో తగ్గించినట్టే ఇప్పుడూ తగ్గిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

పీవీ తరహాలోనే అందరినీ కలుపుకుని పోయే రాజకీయాలు, మధ్యేమార్గాలు మాత్రమే మనల్ని రక్షించగలవని సంజయ్‌బారు అభిప్రాయపడ్డారు. భారత రత్నకు అన్ని విధాలుగా అర్హుడు పీవీ అని.. మన్మోహన్‌ ఏలుబడిలో ఆయనకు ఈ అవార్డు దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కార్యక్రమంలో పీవీ గ్లోబల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ పీవీ ప్రభాకర్‌ రావు, సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వి.వి.లక్ష్మీనారాయణ, సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, మా శర్మ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు