భాగ్యనగర్‌‌ ఖాతాలో మరో ఘనత

5 Jan, 2021 08:22 IST|Sakshi

సీసీ కెమెరాల ఏర్పాటులో అంతర్జాతీయంగా 2వ స్థానం 

లండన్‌ను వెనక్కినెట్టిన హైదరాబాద్, తొలి స్థానంలో చెన్నై 

యూకేకి చెందిన ‘సర్ఫ్‌షార్క్‌’ సంస్థ సర్వేలో వెల్లడి

సాక్షి,హైదరాబాద్‌ : భాగ్యనగరం ఖాతాలో మరో ఘనత చేరింది. ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి స్థానంలో మనదేశానికే చెందిన చెన్నై ఉండటం మరో విశేషం. రెండు దక్షిణాది నగరాలకు జాబితాలో చోటు దక్కడం, రెండూ ప్రపంచంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకోవడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. యూకేకి చెందిన ‘సర్ఫ్‌షార్క్‌’సంస్థ అంతర్జాతీయంగా 130 నగరాల్లో సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ‘‘ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం’’అనే నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం, పోలీసుశాఖ.. సీసీ కెమెరాల ఏర్పాటులో ఈ సరికొత్త మైలురాయి అందుకున్నాయి. నగరంలో ప్రతీ చదరపు కిలోమీటరుకు 480, వెయ్యి మందికి 30 సీసీ కెమెరాలు ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది. – సాక్షి,హైదరాబాద్‌

సురక్షిత నగరం బాటలో! 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారు. వివిధ బహుళజాతి, అగ్ర దేశాల వ్యాపార, పరిశోధన సంస్థలు భాగ్యనగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో సురక్షిత నగరంగా పేరొందితే పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని భావించారు. 2014లో అమల్లోకి వచ్చిన ప్రజాభద్రతా చట్టం కింద సీసీ కెమెరాల ఏర్పాటును ప్రభుత్వం, పోలీస్‌ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లండన్‌ను ఆదర్శంగా తీసుకుని భారీగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సంకల్పించాయి. ఈ క్రమంలో వీటి ఏర్పాటులో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పోలీస్‌ నిలిచిన విషయం తెలిసిందే. ఇక నగరాల వారీగా చూస్తే చెన్నై మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉండే సీసీ కెమెరాల దృశ్యాల పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సైతం నిక్షిప్తం చేయడం మరో ప్రత్యేకత.  
10 లక్షల సీసీ కెమెరాలే లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తెలంగాణ పోలీసుశాఖ సంకల్పం. ఇప్పటిదాకా 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇందులో 2020లోనే 99,095 అమర్చాం. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాం. గతేడాది 4,490 కేసుల్లో నేరస్థుల్ని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరించాయి.   – డీజీపీ డాక్టర్‌ ఎం మహేందర్‌రెడ్డి 


 సంఖ్య పరంగా చూస్తే చెన్నై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సీసీ కెమెరాలున్నాయి. అయితే చెన్నై విస్తీర్ణం 426 చదరపు కి.మీ. కాగా... హైదరాబాద్‌ది 625 చదరపు కి.మీ. అందువల్లే ప్రతి చదరపు కి.మీ.కి ఉన్న కెమెరాల అంశంలో చెన్నై మొదటి స్థానం ఆక్రమించింది. 

దేశంలో ప్రస్తుతం ఏ నగరంలో 
ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయంటే..
 
ఢిల్లీ    4,29,500 
హైదరాబాద్‌    3,25,000 
చెన్నై    2,80,000
కోల్‌కతా    13,800
ముంబై    9,800
అçహ్మదాబాద్‌    6,281
బెంగళూరు    1,301
కొచ్చి, జైపూర్‌    1000 

చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా తీసుకున్న సర్ఫ్‌షార్క్‌ సంస్థ 130 నగరాలతో జాబితా రూపొందించింది. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా, భారత్‌ ముందున్నాయని సర్వే తెలిపింది. చదరపు కిలోమీటరుకు 657 కెమెరాలతో చెన్నై మొత్తం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 480 కెమెరాలతో హైదరాబాద్‌ రెండో స్థానం దక్కించుకుంది. సర్వేలో టాప్‌–10లో చోటు సాధించిన నగరాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్‌టెన్‌  నగరాలివే.. 

నగరం        సీసీ కెమెరా   (చదరపు  1,000 కిలోమీటరుకు) మందికి 
        
1    చెన్నై                  657              25.5 
2    హైదరాబాద్‌          480             30.0 
3    హర్బిన్‌ (చైనా)      411             39.1 
4    లండన్‌ (బ్రిటన్‌)     399             67.5 
5    గ్జియామెన్‌ (చైనా)  385            40.3 
6    చెంగ్డూ (చైనా)       350             33.9 
7    తైయువాన్‌ (చైనా)  319            119.6 
8    ఢిల్లీ                    289              14.2 
9    కున్మింగ్‌ (చైనా)    281              45.0 
10    బీజింగ్‌ (చైనా)    278              56.2   

 

మరిన్ని వార్తలు