-

సికింద్రాబాద్‌ స్టేషన్‌కి కొత్త రూపు

14 Dec, 2022 02:03 IST|Sakshi

ప్రారంభమైన పనులు 

2025 అక్టోబర్‌ నాటికి సిద్ధం 

ఆధునిక వసతులు, వాణిజ్య విభాగాలతో రెండు బ్లాకులుగా నిర్మాణం 

అంచనా వ్యయం 699 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక వసతులతో నిర్మించబోతున్న సికింద్రాబాద్‌ కొత్త స్టేషన్‌ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న స్టేషన్‌ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు, పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు రెండు వేరువేరు భవనాలను నిర్మించనున్నారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన గిర్ధారిలాల్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి ఇటీవలే కాంట్రాక్టు బాధ్యతను రైల్వే అప్పగించింది. నిర్మాణ సంస్థ వెంటనే పనులు ప్రారంభించేసింది. 36 నెలల్లో, అంటే 2025 అక్టోబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. రూ.699 కోట్లతో చేపట్టే ఈ భవనాలకు సంబంధించి ఐఐటీ ఢిల్లీని ప్రూఫ్‌ కన్సల్టెంట్‌గా నియమించారు.

తాజాగా నిర్మాణానికి సంబంధించి సైట్‌ టోపోగ్రాఫిక్‌ సర్వే పూర్తయింది. వివిధ స్థాయిలలో ప్రతిపాదిత ఉపరితలం ఎత్తును గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. బేస్మెంట్, గ్రౌండ్, మిడ్‌ ఫ్లోర్, మొదటి రెండో అంతస్తులు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు.. తదితరాలకు సంబంధించిన డిజైన్‌ 3డీ ప్లాట్‌ను రూపొందించేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది. స్టేషన్‌ భవనం ఉత్తర–దక్షిణ టెర్మినల్స్‌లోని వివిధ ప్రదేశాలలో మట్టి నమూనాలను కూడా పరీక్షించారు.

కొత్త నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వీలుగా పాత రైల్వే క్వార్టర్స్‌ను కూల్చివేశారు. స్టేషన్‌ భవనానికి దక్షిణం వైపున సైట్‌ ఆఫీస్‌తో పాటు సైట్‌ లేబొరేటరీని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఆధునిక వస తులతో సౌకర్యవంతమైన ప్రయాణ ప్రాంగణాన్ని అందించటంతోపాటు మెట్రోతో కనెక్టివిటీ కల్పించేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ వెల్లడించారు. సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సాక్షితో చెప్పారు.  

మరిన్ని వార్తలు