అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్‌ వాడకం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

27 Mar, 2022 07:45 IST|Sakshi

 హైదరాబాద్‌@ 64.5 ఎంయూలు 

ఎండలతో జనాల ఉక్కిరి బిక్కిరి

ఆన్‌లోనే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు

సాక్షి, హైదరాబాద్‌: ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గ్రేటర్‌ జిల్లాల వాసులు ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లోని కరెంట్‌ మీటరు గిరగిరా తిరుగుతోంది. కేవలం వ్యక్తిగత వినియోగం మాత్రమే కాదు గ్రేటర్‌ సగటు విద్యుత్‌ వినియోగం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం 64.5 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఇప్పటికే డిస్కం గృహ విద్యుత్‌ వినియోగంపై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య విద్యుత్‌ వినియోగంపై యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచింది. ఏప్రిల్‌ నెల నుంచి పెంచిన బిల్లులను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.  

ఫీడర్లు, డీటీఆర్‌లపై ఒత్తిడి..    
►గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 55 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో 45.50 లక్షలు గృహ, 7.30 లక్షల వాణిజ్య, 44 వేల పారిశ్రామిక, 1.40 లక్షల వ్యవసాయ, 45 వేల వీధి దీపాల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. 2019 మే 30న అత్యధికంగా 73.9 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. 2021 మే నెలలో అత్యధికంగా 68 ఎయూలు నమోదైంది.

►ఐటీ అనుబంధ రంగాలతో పాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. కేవలం గృహ విద్యుత్‌ విని యోగం మాత్రమే కాకుండా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం కూడా రెట్టింపైంది. ఫలితంగా ప్రస్తుతం రోజు సగటు విద్యుత్‌ వినియోగం 60 యూనిట్లు దాటింది. ఏప్రిల్‌ చివరి నాటికి 75– 80 ఎంయూలకు చేరే అవకాశం లేకపోలేదు.
చదవండి: హైదరాబాద్‌: మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో..

మరిన్ని వార్తలు