పాఠశాలల్లో ‘షీ’క్రెట్‌ ఏజెంట్స్‌.. గుడ్, బ్యాడ్‌ టచ్‌లపై శిక్షణ

30 Sep, 2022 18:07 IST|Sakshi

మైనర్లపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో నిర్ణయం

వంద మంది విద్యార్థులకు 5–10 మంది వలంటీర్లు

సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్: ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్ లోని పాఠశాలలు, వసతి గృహాల్లో మైనర్లపై అఘాయిత్యాలు పెరిగాయి. సెలవుల్లో ఇంటికి వెళ్లిన పిల్లలు ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆరా తీస్తే తప్ప అక్కడేం జరిగిందో బయటపడటం లేదు. పోలీసులంటే పిల్లల్లో నెలకొన్న భయం, ఇతరత్రా కారణాలతో సంఘటన జరిగిన వెంటనే విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించడంలో జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త కార్యాచరణ రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలలో షీ టీమ్స్‌ గూఢచారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

వీటి పనేంటంటే? 
ప్రతి సంస్థలో వంద మంది విద్యార్థులకు 5–10 మంది ఆసక్తి ఉన్న వలంటీర్లను గూఢచారులుగా ఎంపిక చేసి వీరికి గుడ్, బ్యాడ్‌ టచ్‌లతో పాటు పోక్సో చట్టం, కేసులు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆకతాయిలపై ఎలా నిఘా వేయాలి, పోలీసులను సంప్రదించే తీరు, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. దీంతో ఆయా విద్యా సంస్థలు, వసతి గృహాలలోని విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే బృందం సభ్యులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు. 

నివాసిత సంఘాల్లోనూ.. 
నివాసిత సంఘాలలో ఆత్మహత్యలు, గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించేంవదుకు గృహ కమ్యూనిటీలలోనూ స్వచ్ఛంద బృందాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్‌ షీ టీమ్స్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే మేలని సైబరాబాద్‌ షీ టీమ్స్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందుకే హౌసింగ్‌ కమ్యూనిటీలలో స్వచ్ఛంద గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులో పోలీసులు, మనస్తత్వ నిపుణులు, న్యాయ సలహాదారులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సైబరాబాద్‌లోని ప్రతి కమ్యూనిటీల్లో ఈ సభ్యుల ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఉన్నతాధికారి తెలిపారు. (క్లిక్: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల కీలక ప్రకటన.. ఏడాదికి యాక్షన్‌ ప్లాన్‌)

మరిన్ని వార్తలు