Hyderabad: ఎంఎంటీఎస్‌ రైళ్లకు మళ్లీ బ్రేక్‌

17 Jan, 2022 16:06 IST|Sakshi

36 సర్వీసులను నిలిపివేసిన దక్షిణమధ్య రైల్వే

నిర్వహణ నెపంతో తరచూ రైళ్ల నిలిపివేత

ప్రయాణికుల ఆదరణ, ఆదాయం లేకపోవడంతోనే

జంట నగరాల్లో రోజుకు 79 సర్వీసుల రాకపోకలు

వారానికి రెండు మూడుసార్లు రద్దవుతున్న సర్వీసులు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్‌ రైళ్లకు మరోసారి బ్రేక్‌ పడింది. ట్రాక్‌ నిర్వహణ, మరమ్మతుల దృష్ట్యా సోమవారం 36 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫలక్‌నుమా– లింగంపల్లి, సికింద్రాబాద్‌– లింగంపల్లి, లింగంపల్లి– ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌– లింగంపల్లి తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. నిర్వహణపరమైన కారణాలతో రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లేకపోవడం, కనీస స్థాయిలో ఆదాయం లభించకపోవడం వంటి కారణాలతోనే సర్వీసులు రద్దవుతున్నాయి.  

గడ్డుకాలం.. 
తాజాగా కోవిడ్‌ మూడో ఉద్ధృతి మొదలైన నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ రైళ్ల నిర్వహణ మరింత భారంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.5 కనిష్ట చార్జీల నుంచి రూ.15 గరిష్ట చార్జీలతో 40 కిలోమీటర్ల వరకు రవాణా సదుపాయాన్ని అందజేసే అత్యంత చౌకైన రవాణా సర్వీసులు నగరంలో ఎంఎంటీఎస్‌ ఒక్కటే. రెండేళ్ల క్రితం మొదలైన కరోనా ఎంఎంటీఎస్‌కు గడ్డుకాలంగా మారింది. లా క్‌డౌన్‌ అనంతరం దశలవారీగా సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ  పెద్దగా ఆదరణ లభించడం లేదు. (చదవండి: అనాథగా సికింద్రాబాద్‌ వీధుల్లో.. ఏడేళ్లకు సురక్షితంగా..!)

వారంలో రెండు మూడుసార్లు.. 
► గతంలో సికింద్రాబాద్‌– లింగంపల్లి, ఫలక్‌ను మా– సికింద్రాబాద్, లింగంపల్లి– ఫలక్‌నుమా, నాంపల్లి– లింగంపల్లి తదితర రూట్లలో ప్రతిరోజూ 121 సర్వీసులు నడిచేవి. రోజుకు 1.5 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కోవిడ్‌ వల్ల ఏడాది పాటు సర్వీసులను నిలిపివేశారు. గతేడాది మొదట్లో 25 సర్వీసులతో పునరుద్ధరణ  మొదలుపెట్టి  దశలవారీగా ప్రస్తుతం 79 కి పెంచారు. (చదవండి: హైదరాబాద్‌లో అమెజాన్‌ సొంత క్యాంపస్‌.. అదిరిపోయే సౌకర్యాలు)

► ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో వారంలో రెండు మూడు సార్లు కనీసం 20 నుంచి 25 సర్వీసులు రద్దవుతున్నాయి. ప్రస్తుతం సగానికి సగం అంటే 36 సర్వీసులను సోమవారం ఒక్కరోజే  రద్దు చేయనున్నారు. సాధారణంగా సికింద్రాబాద్‌– లింగంపల్లి మార్గంలో ప్రయాణికులు రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటారు. కోవిడ్‌ మూడో ఉద్ధృతితో అనేక ప్రైవేట్‌ సంస్థలు, ఐటీ సంస్థలు తిరిగి వర్క్‌ఫ్రం హోమ్‌కు  అవకాశం కల్పించాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు తగ్గుముఖం పట్టాయి.

మరిన్ని వార్తలు