17న రాజ్యాంగ పరిరక్షణ దీక్ష 

16 Mar, 2022 02:21 IST|Sakshi

స్పీకర్‌ తీరుకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల నుంచి తమ సస్పెన్షన్, సభలోకి అనుమతించే అంశాలపై పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్‌ పట్టించుకోకపోవడా న్ని నిరసిస్తూ ఈనెల 17న ఇందిరాపార్క్‌ వద్ద రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్‌ రావు తెలిపారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు.

స్పీకర్‌ హోదాకు విలువనిస్తూ కోర్టు గౌరవ సూచన చేసినా, ఆ స్ఫూర్తిని తుంగలోతొక్కి దురదృష్టకర సంప్రదాయాన్ని లేవనెత్తారని ఈటల విమర్శించారు. స్పీకర్‌ తన గౌర వాన్ని నిలుపుకోలేకపోవ డం దురదృష్టకరమన్నారు. ఆస్ట్రియా బృందం ఈ రోజు అసెంబ్లీ వ్యవహారాలు పరిశీలి స్తున్న సందర్భం లో తమ సస్పెన్షన్‌ ఒక దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. ఈ విధానాలు చూస్తుంటే ఉత్తర కొరి యా గుర్తు వస్తుందని, అక్కడ రాజు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చప్పట్లు కొట్టలేదు అని ఒక సభ్యున్ని కాల్చి చంపారని ఈటల పేర్కొన్నారు.

ఇకపై ఇక్కడా చప్పట్లు కొట్టలేదని కూడా సస్పెండ్‌ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా ఒక ఉద్యమ నాయకుడినేనని గతంలో ఉద్యమాన్ని తూలనాడిన వారితోనే తమను సస్పెండ్‌ చేయించడం అవమానకరమన్నారు. ‘హైకోర్టు ఉత్తర్వులు, మీ పిటిషన్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీ అభ్యర్థన తిరస్కరిస్తున్నా’అని స్పీకర్‌ చెప్పారని రఘునందన్‌ రావు తెలిపారు. తమ అభ్యర్థనను సభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరినా స్పీకర్‌ వినలేదన్నారు. ‘ప్రజాస్వామ్య చరిత్రలో ఇది బ్లాక్‌డే. స్పీకర్‌ తనకు వచ్చిన డైరెక్షన్‌ మేరకే పని చేస్తున్నారు’అని రఘునందన్‌ విమర్శించారు.  

మరిన్ని వార్తలు