అతనో డివిజన్‌ కార్పొరేటర్‌.. అందరూ పిలిచేది మాత్రం పాలబాబు!

30 May, 2022 21:21 IST|Sakshi
పాలు పితుకుతున్న కార్పొరేటర్‌ పానుగంటి బాబు (పాల బాబు)

అతడో డివిజన్‌కు కార్పొరేటర్‌. ఓ వైపు కార్పొరేటర్‌గా డివిజన్‌ ప్రజలకు సేవ చేస్తూనే తాను నమ్ముకున్న వృత్తి అయిన పాడిలో రాణిస్తున్నాడు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌26వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాబు అంటే ఎవరూ గుర్తుపట్టరు. కానీ పాల బాబు అంటే జవహర్‌నగర్‌లో అందరూ గుర్తుపడతారు. కార్పొరేటర్‌ కంటే పాడి వృత్తే తనకు గుర్తింపు ఇచ్చిందని గర్వంగా చెప్పుకుంటాడు పానుగంటి బాబు అలియాస్‌ పాల బాబు. అలా తన వృత్తియె ఇంటి పేరుగా మారిందని చెబుతాడు.

సాక్షి,జవహర్‌నగర్‌(హైదరాబాద్‌): వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బాబు ఇంటర్మీడియట్‌ వరకు చదివాడు. పాడిపై దృష్టి సారించి లోకల్‌ గేదేలతో పాల వ్యాపారం చేశాడు. మరింత పాల ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో ముర్రా జాతి గేదేలను తీసుకురావాలని సంకల్పించాడు. హర్యానా ప్రాంతంలోని రోతక్‌ నుంచి, విజయవాడ నుంచి ముర్రాజాతి గేదెలను, మహారాష్ట్రలోని షిర్టీ ప్రాంతంలో లభించే హెచ్‌ఎఫ్‌ బ్రీడ్‌కు చెందిన ఆవులను తీసుకొచ్చి పెంచుతున్నాడు. 

పశువుల కోసం సొంతంగా గడ్డిపెంపకం.. 
గెదెలు, ఆవుల సంరక్షణకు రూ.4.20లక్షలు వెచ్చి ంచి 70 పశువులు ఉండేలా షెడ్డులను ఏర్పాటు చేశాడు. ఈ పశువులకు ఉదయం, సాయంత్రం శుభ్రం చేయడమే కాకుండా షెడ్డును కూడా శుభ్రపరుస్తాడు. అలాగే ఉందయం ఒకపూట పచ్చిగడ్డి, రెండు పూటల వరిగడ్డి అందజేస్తాడు. అందుకోసం ఆయన 4ఎకరాల్లో ప్రత్యేకంగా పలు రకాల గడ్డిని పండిస్తున్నాడు. 

గేదెలకు ఇన్సూరెన్స్‌... 
ప్రస్తుతం అతడి వద్ద ముర్రా జాతికి చెందిన గేదెలు 54, జర్సీ ఆవులు (హెచ్‌ఎఫ్‌బీడ్‌) 10 ఉన్నాయి. ఇవి ప్రతి రోజు 350 లీటర్ల పాలను ఇస్తున్నాయి. పాల బాబు వీటికి ఇన్సూరెన్స్‌ కూడా చేయించడం విశేషం.

ఆదాయంలో కొంత సమాజ సేవకు.. 
పానుగంటి బాబు కార్పొరేటర్‌ అయిన తర్వాత సమాజ సేవవైపు దృష్టి పెట్టారు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత డబ్బును పేదలను ఆదుకోవడానికి ఉపయోగిస్తున్నారు. తన తండ్రి పానుగంటి బాలయ్య పేరుతో అంత్యక్రియల వాహనాన్ని కార్పొరేషన్‌కు అందజేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి పేదలకు నిత్యావసరాలను అందజేశారు. తాజాగా వృద్ధాప్య పింఛన్‌దారులకు ‘బాలయ్య భోజనం’పేరుతో ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

చదవండి: Hyderabad: బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు

మరిన్ని వార్తలు