భార్యా భర్తలకు ఒకే చోట పనిచేసే అవకాశమేది?

18 Apr, 2022 03:30 IST|Sakshi

‘స్పౌజ్‌’ పోలీసుల మనోవేదన!

బదిలీలతో నెలల తరబడి పిల్లలకు దూరంగా తల్లిదండ్రులు

రోజుకో రకంగా ఆందోళన రేపుతున్న ఆడియో సందేశాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా పోలీసు శాఖలో జరిగిన బదిలీలు భార్యాభర్తలైన కానిస్టేబుళ్లకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వేర్వేరు జిల్లాల్లో నెలల తరబడి కుటుంబాలకు దూరంగా పనిచేయాల్సి రావడం వారిలో తీవ్ర మనోవేదన కలిగిస్తున్నాయి.  

ఆత్మహత్యకు వెనుకాడలేం...
రాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న జంటలు దాదాపు 200 వరకు ఉంటాయని అంచనా. ఇటీవల జరిగిన నూతన జిల్లాల బదిలీల్లో భార్యాభర్తలంతా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అయితే భార్యాభర్తలకు ఒకేచోట పనిచేసే వెసులుబాటు కలి్పంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఆయా జంటలు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆదేశాలు వెలువడలేదు. దీంతో రామగుండం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్, రాచకొండ తదితర యూనిట్లలో పనిచేస్తున్న భార్యభర్తలైన కానిస్టేబుళ్లు ఒంటరితనంతో బతకలేక సతమతమవుతున్నారు.

నిత్యం ఎవరో ఒకరు తమ ఆవేదనను ఆడియో సందేశాల రూపంలో బయటపెడుతున్నారు. కుటుంబాలకు దూరంగా పనిచేస్తూ నరకయాతన అనుభవిస్తున్నామని, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటామో తెలియని పరిస్థితుల్లో బతకాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌ పడుతున్న బాధ అంతాఇంతా కాదు. తన భర్త మరో జిల్లాలో పనిచేస్తుండటంతో మూడేళ్ల పిల్లాడిని ఎవరూ చూసే వారు లేక చంటి పిల్లాడిని చంకన వేసుకొని బందోబస్తు డ్యూటీలు కూడా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. 

పిల్లల భవిష్యత్‌పై ప్రభావం... 
కొన్ని సంఘటనల్లో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎదుగుతున్న పిల్లలపై శ్రద్ధ తీసుకోకపోతే వారి భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికత సమస్య కూడా కానిస్టేబుళ్ల దంపతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇన్నాళ్లూ సొంత జిల్లాల్లో పనిచేసిన వారు వేరే జిల్లాకు బదిలీ కావడం వల్ల తమ పిల్లల స్థానికత విషయంలో సమస్య ఏర్పడుతుందని కలవరానికి గురవుతున్నారు. కాగా, బదిలీల సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియట్లేదని ఉన్నతాధికారులు అంటున్నారు.

  

మరిన్ని వార్తలు