హైఫై ఫ్లైఓవర్‌.. ఎస్సార్‌డీపీ పనుల్లో మరో ప్రత్యేకత!

18 May, 2022 16:39 IST|Sakshi

శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌లో స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్స్‌ వినియోగం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ట్రాఫిక్‌ చిక్కులు తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25వేల కోట్లకుపైగా  అంచనా వ్యయంతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్‌డీపీ)లో భాగంగా చేపట్టిన వివిధ పనుల్లో పలు ప్రత్యేకతలు చూపింది. అసాధ్యమనుకున్న కేబుల్‌ స్టే బ్రిడ్జి వంటి పనులతో పాటు వివిధ ఫ్లైఓవర్లలో అడపాదడపా ప్రత్యేకతలు చూపుతున్నారు. నగరంలో ఇప్పటి వరకు లేని అధునాతన సాంకేతిక విధానాలు అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా మైండ్‌స్పేస్‌ దగ్గరి శిల్పా లే అవుట్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ పనుల్లో భాగంగా స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్స్‌ అమరుస్తున్నారు. 

ఏమిటీ ప్రత్యేకత? 
►ఫ్లైఓవర్ల మార్గాల్లో మలుపులు, మూలలు వంటివి వచ్చే ప్రాంతాల్లో  పోర్టల్‌ ఫ్రేమ్స్‌ను వాడతారు. మెట్రో రైలు మార్గాల్లోనూ పలు ప్రాంతాల్లో ఇలాంటి పోర్టల్‌ ఫ్రేమ్స్‌ వినియోగించినట్లు  ఇంజినీర్లు తెలిపారు. శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌కు పోర్టల్‌ ఫ్రేమ్స్‌ అవసరమైన మూడు చోట్ల కాంక్రీట్‌ పోర్టల్‌ ఫ్రేమ్స్‌ బదులు స్టీల్‌ ఫ్రేమ్స్‌ను వాడుతున్నారు. స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్స్‌ వాడటం నగరంలో ఇదే మొదటిసారని,  23 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పు కలిగిన మొదటి స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్‌ను కాంట్రాక్టు ఏజెన్సీ విజయవంతంగా అమర్చిందని పనులు పర్యవేక్షిస్తున్న సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ వెంకటరమణ తెలిపారు. 

► మీనాక్షి టవర్స్‌ పరిసరాల్లో ఈ ఫ్లైఓవర్‌ మార్గంలో మొత్తం మూడు పోర్టల్స్‌ అవసరం.  ఈ సంవత్సరం దీపావళి కానుకగా ఈ ఫ్లై ఓవర్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫ్లైఓవర్‌ మార్గంలో  రద్దీ సమయంలో వాహనాలు గంటకు 1464 పీసీయూ కాగా, 2040 నాటికి ఇది 5194  పీసీయూకు చేరుతుందని అంచనా. నాలుగు వరుసల్లో నిర్మిస్తున్న  ఫ్లై ఓవర్‌పై రెండు వైపులా ప్రయాణం చేయవచ్చు. కొండాపూర్‌ వైపు నుంచి ఓఆర్‌ఆర్‌వైపు వెళ్లే ఫ్లైఓవర్‌ పనుల్లో భాగంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై రెండో వరసలో భూమి నుంచి 18 మీటర్ల ఎత్తులో 64 మీటర్ల పొడవైన 3 స్టీల్‌ గర్డర్లను  ఏర్పాటు చేయడం తెలిసిందే. (క్లిక్‌: 111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?)

మరిన్ని వార్తలు