హైదరాబాద్‌లో రహదారే.. ఇక రైలు దారి!

17 Feb, 2021 08:15 IST|Sakshi

భాగ్యనగరంలో ట్రా‘ఫికర్‌’ లేని కాలుష్య రహిత ప్రయాణంపై ఫోకస్‌

‘లైట్‌ ట్రైన్‌’ తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండీఏ ఉమ్టా అధ్యయనం

కేపీహెచ్‌బీ నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మీదుగా కోకాపేట వరకు..

28 కి.మీ. మేర ఈ రవాణామార్గం సాధ్యమంటున్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ రహదారులపై ఇక రైలు కూతలు వినిపించనున్నాయి. బస్సు ప్రయాణం మాదిరిగానే రోడ్డుపైనా ఏర్పాటు చేసే ట్రాక్‌ల మీదుగా వచ్చే లైట్‌ ట్రైన్‌ను ఎక్కేసి ఎంచక్కా అనుకున్న సమయానికే గమ్యం చేరుకునే ‘లైట్‌ ట్రైన్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌’నెలకొల్పే దిశగా అడుగులు పడుతున్నాయి. కేపీహెచ్‌బీలోని జేఎన్‌టీయూ నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వైపు నుంచి కోకాపేట వరకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థకు అనుబంధమైన యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అథారిటీ (ఉమ్టా) అధ్యయనం చేస్తోంది. దాదాపు 28 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు సా«ధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. గత మూడు నెలల నుంచి దీనిపై అధ్యయనం చేస్తున్న సిబ్బంది సాధ్యమైనంత తొందర్లోనే ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.

ఉపయోగాలేంటంటే..
నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినా మెట్లెక్కి పైకెళ్లి టికెట్‌ తీసుకొని ఆ రైలు ఎక్కాలంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. అదే లైట్‌ ట్రైన్‌ సేవలు అందుబాటులోకి వస్తే నేరుగా రహదారిపై బస్సులు ఎక్కినట్టుగానే ప్రయాణికులు ఆయా స్టాప్‌ల వద్ద టికెట్లు తీసుకొని రైలు రాగానే ఎక్కేయొచ్చు. బస్సు మాదిరిగానే వీటికి స్టాప్‌లు ఉండటంతో గమ్యస్థానంలో అనుకున్న సమయానికి దిగేయవచ్చు. ముఖ్యంగా నగరవాసుల సమయం మరింత ఆదా కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రాఫిక్‌ తిప్పలుండవు.. అలాగే ఈ సేవల వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఆయా మార్గాల్లో ఉన్న ఆస్తుల విలువ పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు మరింత ఊపందుకునే ఆస్కారముంటుంది. దీంతో పాటు పేదలు కూడా ఎక్కేలా తక్కువ చార్జీలకే ఈ సేవలు అందుబాటు లో ఉండే అవకాశముంది. ఇటు పర్యాటకంగా మరింత అభివృద్ధి బాటలు పట్టే చాన్స్‌ ఉంది. 

ఏయే మార్గాల్లో...?
ఐటీ కారిడార్‌కు నెలవైన ప్రాంతాల్లో ఈ లైట్‌ ట్రైన్‌ సేవల దిశగా ఉమ్టా సిబ్బంది అధ్యయనం చేస్తోంది. కేపీహెచ్‌బీ నుంచి హైటెక్‌ సిటీ, రాయదుర్గం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, ఓఆర్‌ఆర్‌ మీద నుంచి కోకాపేట వరకు ఈ రవాణా మార్గం అనువుగా ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు 28 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారి కుడివైపున మీటర్‌ గేజ్‌ ఏర్పాటు చేసి బ్యాటరీ ఆపరేటింగ్‌ లేదంటే విద్యుత్‌ సరఫరాతో ఈ రైలును నడపనున్నారు. దాదాపు 150 నుంచి 200 మంది ప్రయాణికులు ఈ రైలులో ఎక్కి హ్యాపీగా జర్నీ చేయవచ్చని అధికారులు అంటున్నారు. బస్సులు, ఇతర వాహనాల మాదిరిగానే రోడ్డుపై లైట్‌ ట్రైన్‌ వెళ్తుందని, ఈ సే వలు అందుబాటులోకి వస్తే విశ్వనగరంగా హైదరాబాద్‌కు మరింత ప్రతిష్ట పెరుగుతుందని చెబుతున్నారు. 

చదవండి:
స్టాఫ్‌నర్స్‌ పోస్టుల వెయిటేజీలో అవకతవకలు
నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: మేయర్‌

మరిన్ని వార్తలు