ఆన్‌లైన్‌ అధ్యయనం.. తిప్పలు తప్పట్లేదు

20 Jul, 2021 14:19 IST|Sakshi

మూసాపేట: బ్లాక్‌ బోర్డ్, చాక్‌పీస్, డస్టర్‌ అంటూ తరగతి గదుల్లో తోటి విద్యార్థుల మధ్య సరదాగా చదువుకోవాల్సిన విద్యార్థులకు ఆండ్రాయిడ్‌ మొబైల్, ప్లే స్టోర్, ఇంటర్నెట్‌ వంటి కొత్త యాప్‌లతో కుస్తీ పడుతూ చదువుకోవాల్సి వస్తోంది. కరోనా మహమ్మారితో అన్ని రంగాలు కుదేలవటమే కాక విద్యార్థులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించి పై తరగతులకు అనుమతించారు. ఈ సంవత్సరం కూడా కరోనా వ్యాప్తితో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు.

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద కుటుంబానికి చెందిన వారే కావటంతో వారి వద్ద ఆండ్రాయిడ్‌ మొబైల్‌ లేకపోవటం, టీవీలు కొంత మందికి లేకపోవటం, మరి కొందరు కేబుల్‌ బిల్లు చెల్లించక పోవటంతో ప్రతి రోజు తరగతులను వినేందుకు అవకాశం లేకుండా పోయింది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఎదురుగా ఉండి పాఠాలు బోధిస్తేనే అంతంత మాత్రంగా అర్థం చేసుకునే ఈ చదువులు ఆన్‌లైన్‌లో టీవీల ముందు, సెల్‌ఫోన్‌లో వింటే వారికి అర్థం కావటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.  


►మూసాపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 435 మంది విద్యార్థులు ఉండగా 10వ తరగతిలో 75 మంది ఉన్నారు.  
► ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పేద కుటుంబాల వారు కావటంతో మొబైల్‌ లేకపోవటం, టీవీల అందరి వద్ద లేకపోవటంతో పాఠాలకు దూరమవుతున్నారు.  
► తరగతి గదుల్లో ఉండి చదివే చదువులకు ఆన్‌లైన్‌లో చదివే చదువులకు వ్యత్యాసం ఉండటమే కాకుండా విద్యార్థులకు అర్థం కాక సతమతమవుతున్నారు.  
► ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థులను పరీక్షిస్తూ మొబైల్‌లో టిశాట్‌ యాప్‌ ద్వారా, టీవీలో డీడీ యాదగిరి చానల్‌లో పాఠాలు వినాలని అందుకు సంబంధించిన టైం టేబుల్‌ను కూడా విద్యార్థులకు అందిస్తున్నారు.  
► ఇదే విధంగా ఆన్‌లైన్‌లో చదివి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరైతే మాత్రం ఉత్తీర్ణత శాతం పడిపోయే అవకాశం ఉంది. అంతే కాక ఉన్నత చదువులకు వెళ్లటానికి అక్కడి పాఠాలు అర్థమయ్యే పరిస్థితి ఉండదు.  
► అయితే ఆన్‌లైన్‌ పాఠాలు వింటూ తమ ఇంటి సమీపంలో ఉన్నత చదువులు చదివిన వారి వద్ద సందేహాలను నివృత్తి చేసుకుని కష్టపడి చదివితేనే ఉత్తీర్ణత సాధించుకోవచ్చు.  
► అలా కాకుండా గతంలో మాదిరి ఇంట్లో వింటూ వదిలేసి ఉంటే మాత్రం అర్థం కాకపోవటమే కాక పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉంటుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  
► మొబైల్‌ విద్యార్థుల చేతుల్లో ఉండటంతో ఇంటర్నెట్‌లో కొత్త కొత్త గేమ్‌లు, సినిమాలు, వీడియోలకు అలవాటు పడుతున్నారు. చదువు సంగతి పక్కన పెడితే మొబైల్‌కు అలవాటు పడి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.  
► అదే విధంగా కళ్లకు సంబంధించి జబ్బులు ప్రబలుతుండటం, మరి కొంతమంది విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాల పేర్లతో మొబైల్‌లో గేమ్స్, సినిమాలు చూస్తున్నారని వారి భవిష్యత్‌ గురించి భయంగా ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

మరిన్ని వార్తలు