బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థన తిరస్కృతి 

16 Mar, 2022 02:12 IST|Sakshi

సస్పెన్షన్‌ ఎత్తివేతను తోసిపుచ్చిన స్పీకర్‌ పోచారం

అది సభ ఏకగ్రీవ నిర్ణయమని వ్యాఖ్య

తిరుగుముఖం పట్టిన రాజాసింగ్, ఈటల, రఘునందన్‌

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు బీజేపీ శాసనసభ్యులు తమపై విధించిన బహిష్కరణను ఎత్తివేయాలంటూ మంగళవారం శాసన సభాపతి చాంబర్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. అయితే సస్పెన్షన్‌ నిర్ణయం శాసనసభ ఏకగ్రీవ నిర్ణయమని పోచారం స్పష్టం చేయడంతో అసెంబ్లీ నుంచి వెనుదిరిగారు.

ఈ నెల 9న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్‌ ముగిసే వరకు సస్పెండ్‌ చేస్తూ సభ తీర్మానించడం తెలిసిందే. దీన్ని సవాల్‌చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారిని సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకే బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో సుమారు 45 నిమిషాలపాటు స్పీకర్‌ను కలిసేందుకు వేచిచూశారు.

చివరకు స్పీకర్‌ చాంబర్‌లో కలిసేందుకు వారికి పిలుపు రావడంతో పోచారాన్ని కలిసి కోర్టు ఉత్తర్వులతోపాటు సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించారు. సభ జరుగుతున్న సమయంలో తమ స్థానం నుంచి కదలలేదని, సభను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని రఘునం దన్‌రావు, ఈటల రాజేందర్‌ వివరణ ఇచ్చినట్లు సమాచారం. తమను బహిష్కరించడం అన్యాయమని, పార్టీలను పక్కనపెట్టి పక్షపాతరహితంగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీ సభ్యులు కోరారు.

పోడియంలోకి వచ్చినట్లు భావిస్తే తాను సస్పెన్షన్‌కు అర్హుడనని, మిగ తా ఇద్దరు సభ్యులను సభకు అనుమతించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పీకర్‌కు విన్నవించారు. ‘సస్పెన్షన్‌ నిర్ణయం శాసనసభ ఏకగ్రీవంగా తీసుకుందని’స్పీకర్‌ వ్యాఖ్యానించగా తమ వినతిని సభతోపాటు సభానాయకుడి ముందు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిసింది. ఈలోగా శాసనసభ సమావేశం ప్రారంభమైనట్లు గంట మోగడంతో స్పీకర్‌ సభలోకి వెళ్లగా బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుముఖం పట్టారు. ‘మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నా’అని స్పీకర్‌ ప్రకటించారని సభ నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో ప్రకటించారు.  

మరిన్ని వార్తలు