కోవిడ్‌ దడ.. ఆన్‌లైన్‌ అండ..

21 Jun, 2021 07:56 IST|Sakshi

కోవిడ్‌ బాధితులకు ప్రత్యేక వేదిక ద్వారా సేవలు 

డాక్టర్ల సలహాలు, సూచనలు 

స్వచ్ఛంద సహాయం సైతం.. 

ఓ ఐటీ నిపుణుడి సేవాతత్పరత 

కోవిడ్‌ బాధితులకు ముఖ్యంగా కావాల్సింది చికిత్సకు సంబంధించిన సమాచారం, అవగాహన. ఈ రెండు అంశాలపై సేవలందించేందుకు ఇంటర్నెట్‌ ఆధారంగా నగరానికి చెందిన ఐటీ నిపుణుడు శ్రీధర్‌ ‘ఐటీ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌’ పేరిట ఓ వేదికనే కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ గ్రూప్స్‌ ద్వారా డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలను అనుసంధానం చేస్తూ కోవిడ్, పోస్ట్‌ కోవిడ్‌ బాధితులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరో 
తన భార్య కోవిడ్‌ బారిన పడటంతో ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు, అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో తనలాగే ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులకు ఆసరాగా నిలవాలనుకున్నానని శ్రీధర్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ సమస్యలన్నింటికి పరిష్కారం లభించేలా ఆన్‌లైన్‌ వేదిక ఏర్పాటు చేశానని, దీని ద్వారా స్పెషలిస్టు డాక్టర్లతో కోవిడ్‌ పేషెంట్లకు అవసరమైన ఆరోగ్య సలహాలు, సూచనలను అందిస్తున్నామన్నారు. వలంటీర్ల సహాయంతో హాస్పిటళ్లలో బెడ్స్‌ వివరాలు, వెంటిలేటర్, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఎక్మో చికిత్స తదితర సమాచారాన్ని సేకరించి కోవిడ్‌ పేషెంట్స్‌కు అందిస్తున్నామన్నారు. ఐదుగురు డాక్టర్లు, కొద్ది మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులతో ప్రారంభించి నెల రోజుల్లోనే వంద మంది డాక్టర్లతో సిటీలోనే కాకుండా  ఏపీ, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర నగరాలకు తమ సేవలను విస్తరించామన్నారు.  

విభజించు..సేవలందించు.. 
ఈ నెట్‌వర్క్‌ను చిన్నారులు, పెద్దవారు, వ్యాక్సిన్‌ అనే మూడు విభాగాలుగా విభజించి ప్రతి విభాగానికి 4 వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేశామని శ్రీధర్‌ తెలిపారు. మొత్తం 12 గ్రూప్స్‌ ద్వారా కోవిడ్‌ పేషెంట్లకు వ్యాక్సిన్, చికిత్సకు సంబంధించిన సమాచారం అందిస్తున్నా మన్నారు.  

థర్డ్‌వేవ్‌పై ముందస్తుగా... 
థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని జూమ్‌ కాన్ఫరెన్స్‌లలో ప్రత్యేకంగా పిల్లల కోసం పీడియాట్రిక్‌ సెషన్స్, జూమ్‌ క్లినిక్స్, పోస్ట్‌ కోవిడ్‌ పేషెంట్ల కోసం సైకలాజికల్‌ సెషన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ సేవలను పొందాలనుకునే వారు 84639 12345 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.  

నిరంతర సేవలు.. 
వైద్యురాలిగా నా వృత్తిని నిర్వహిస్తూనే సామాజిక బాధ్యతగా ఈ ఆన్‌లైన్‌ వేదికలో సేవలందిస్తున్నాను. ప్రస్తుతం చిన్నారుల విషయంలో ఎన్నో భయాలు, ఆందోళనలు ఉన్నాయి. అర్థరాత్రి సంప్రదించినా సరే వారి సమస్యలను నివృత్తి చేస్తూ, ఆరోగ్య సలహాలు, సూచనలను అందిస్తున్నాను.  –డా.మాధవి బొర్రా,కన్సల్టెంట్‌ పీడియాట్రీషియన్, గచ్చిబౌలి

మరిన్ని వార్తలు