టీచర్ల బదిలీలపై స్టే.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

15 Feb, 2023 02:18 IST|Sakshi

తదుపరి ఆదేశాలిచ్చే వరకు అమల్లో..  

విచారణ మార్చి 14కు వాయిదా  

సర్కారు జీవో రద్దు కోరుతూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కొందరు ఉపాధ్యాయులు 

సంఘాలకు, స్పౌజ్‌ కేటగిరీకి పాయింట్లు ఇవ్వకుండా బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. బదిలీలకు సంబంధించి వారం క్రితం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9 చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం థోల్‌కట్టకు చెందిన సక్కుబాయితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవోను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. లేదా.. ప్రత్యామ్నాయంగా టీచర్స్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్లకు, జీవిత భాగస్వామి కేటగిరీ కింద కొందరికి ఎలాంటి అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలను చేపట్టేలా ప్రతివాదులను ఆదేశించాలని కోరారు.

ప్రతివాదులుగా పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్, డైరెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పీఆర్‌టీయూ, టీఎస్‌యూటీఎఫ్‌ సంఘాలను చేర్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాస నం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. జీవోలో పేర్కొన్న తెలంగాణ టీచర్స్‌ రూల్స్‌ 2023 ప్రకారం బదిలీలు చేపట్టాలంటే వాటికి అసెంబ్లీ ఆమోదం అవసరమని చెప్పారు. ఆరి్టకల్‌ 309 ప్రకారం చేయాలన్నా గవర్నర్‌ ఆమోదించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఎలాంటి ఆమోదం లేకుండా నేరుగా ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం చట్టవిరుద్ధమని నివేదించారు. ఉపాధ్యాయ సంఘాలకు, స్పౌజ్‌ కేటగిరీకి అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయా లని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ల వాదనను పరిగణనలో తీసుకుని బదిలీలపై స్టే ఇస్తూ, విచారణను వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు