తెలంగాణకు అతిథులు వస్తున్నారు.. కరోనా తర్వాత పెరిగిన సంఖ్య!

23 Feb, 2023 10:21 IST|Sakshi

కరోనా తర్వాత తెలంగాణకు పెరుగుతున్న టూరిస్టుల సంఖ్య 

2021–22లో 3.2 కోట్ల మంది, 2022–23లో 6.07 కోట్ల మంది స్వదేశీ పర్యాటకుల రాక 

5,917 నుంచి 68,401కి చేరిన విదేశీ పర్యాటకుల సంఖ్య 

2014–15లో సందర్శించిన 7.2 కోట్ల మందితో పోలిస్తే ఇంకా వెనుకబాటే 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారికి కుదేలైన తెలంగాణ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. స్వదేశీ, విదేశీ పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. కరోనా కంటే ముందున్న స్థాయిలో కాకున్నా చాలావరకు మెరుగుపడింది. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2023 ప్రకారం ఈ ఏడాది (2022–23)లో 68 వేల మందికిపైగా విదేశీ పర్యాటకులు, 6 కోట్ల మందికిపైగా స్వదేశీయులు (వివిధ రాష్ట్రాలకు చెందినవారు) తెలంగాణ ఆధ్యాతి్మక, పర్యాటక సొబగులను ఆస్వాదించేందుకు వచ్చారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సహా కొలనుపాక, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి, భద్రాద్రికి సందర్శకులు పోటెత్తుతున్నారు.

కేవలం తీర్థయాత్రలేగాకుండా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం,చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలతోపాటు గతేడాది అట్టహాసంగా ప్రారంభమైన ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విదేశీ టూరిస్టుల్లో మాత్రం అగ్రభాగం వైద్యసేవలు పొందేందుకే వస్తున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది ఆఫిక్రా దేశాల నుంచి వస్తుండగా యూరప్, అమెరికా తదితర దేశాల నుంచి సందర్శకులు, ఐటీ నిపుణులు భాగ్యనగరానికి అత్యధికంగా వచ్చిన వారిలో ఉన్నారు. 

మహమ్మారి వ్యాప్తికి ముందు 9 కోట్లకు పైనే
2020లో కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం కుదేలైంది. లాక్‌డౌన్లు, కరోనా ఆంక్షల కారణంగా జనజీవనం దాదాపుగా స్తంభించింది. ఆ తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరగడం, టీకాలు అందుబాటులోకి రావడం, ఆంక్షలను సడలించడంతో క్రమంగా పర్యాటకం ఊపందుకుంటోంది. కరోనా వ్యాప్తికి ముందు 2016–17లో అత్యధికంగా 9.5 కోట్ల మందికిపైగా స్వదేశీ, 1.6 లక్షల మందికిపైగా విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వచ్చారు.

కరోనా తాకిడి తర్వాత అత్యల్పంగా 2021–22లో 3.2 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులు, 5,917 మంది అంతర్జాతీయ పర్యాటకులు వచి్చనట్లు గణాంకాలు చెబుతున్నా యి. ఇక ఆ మరుసటి ఏడాదిలోనే ఈ సంఖ్యలో 89.84% (స్వదేశీ పర్యాటకులు), 1,056.01% (విదేశీ పర్యాటకులు) వృద్ధి నమోదు కావడం విశేషం.

చదవండి  వెల్‌డన్‌ పీటీఓ.. పాత వస్తువులతో కొత్త ఫర్నీచర్‌

మరిన్ని వార్తలు