హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో సీన్‌ మారింది!

29 Dec, 2020 15:58 IST|Sakshi

ఐటీ కారిడార్‌లో అద్దెకు వచ్చే వారేరి?

కోవిడ్‌ ఎఫెక్ట్‌తో ఇళ్లన్నీ ఖాళీ

ఎక్కడ చూసినా టులెట్‌ బోర్డులే..

అద్దె తగ్గించినా ఫలితం శూన్యం

ఐటీ కారిడార్‌లో అన్నీ కాస్ట్‌లీనే. ఇక్కడ ఇల్లు లేదా ఫ్లాట్‌ అద్దెకు తీసుకోవాలంటే నెలకు రూ.50 వేల పైనే ఆదాయం ఉండాలి. అసలిక్కడ ఇల్లు కావాలంటే ముందు రెంటల్‌ ఏజెన్సీలను..బ్రోకర్లను ఆశ్రయించాలి. వారు అడిగినంత కమీషన్‌ ఇవ్వాలి. లేకుంటే ఇల్లు అద్దెకు దొరకదు.. ఇదీ కోవిడ్‌–లాక్‌డౌన్‌కు ముందు ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని పరిస్థితి...

ఇప్పుడు సీన్‌ మారింది. ఇళ్లు, ఫ్లాట్లు అన్నీ ఖాళీ అయ్యాయి. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం ప్రకటించడం.. స్కూళ్లు మూతబడి ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతుండడం, కొందరు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోవడం వంటి కారణాల వల్ల వేలాది మంది నగరం విడిచి వెళ్లారు. దీంతో ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్న కొండాపూర్‌లో వైట్‌ఫీల్డ్, గ్రీన్‌ఫీల్డ్‌ , వసంత వ్యాలీ, మాదాపూర్, గచ్చిబౌలిలో వందలాది ఫ్లాట్లు, ఇళ్లు ఖాళీగా మారాయి. అద్దె సగానికి భారీగా తగ్గించినా ఫలితం లేదు. ఎక్కడ చూసినా టులెట్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అద్దెల ఆదాయం పడిపోయి ఓనర్లు దిగాలు చెందుతున్నారు. కమీషన్లు రాక రెంటల్‌ ఏజెన్సీల నిర్వాహకులు, బ్రోకర్లు బోరుమంటున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: వర్క్‌ఫ్రం హోం, ఆన్‌లైన్‌ క్లాసులతో ఐటీ కారిడార్‌లో అద్దె ఇళ్లపై తీవ్ర ప్రభావం పడింది. టు లెట్‌ బోర్డులు పెట్టడంతోపాటు అద్దెకు ఇస్తామని ఆన్‌లైన్‌లోనూ వందల కొద్దీ ప్రకటనలు ఇస్తున్నారు. అద్దె తగ్గించినా వచ్చే వారు కనుచూపు మేరలోనూ కనిపించడం లేదు. అద్దెకు దిగేవారి కోసం ఓనర్లు ఎదురుచూడాల్సి వస్తోంది.

► కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వెళ్లే ప్రధాన రహదారి, కొత్తగూడ నుంచి మాదాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న వైట్‌ పీల్డ్, గ్రీన్‌ఫీల్డ్‌లో అద్దెకు ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి. అక్కడ దాదాపు 100కు పైగా అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ప్రతి అపార్ట్‌మెంట్‌ ముందు టులెట్‌ బోర్డులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి.  

► లాక్‌డౌన్‌కు ముందు ఫ్లాట్‌ అద్దెకు దొరకాలంటేనే ఎంతో శ్రమించాల్సి వచ్చేది. గతంలో బ్యాచ్‌లర్స్‌కు అద్దెకు ఇచ్చేవారు. బ్రోకర్లకు ముందే కమిషన్‌ ఇస్తే ఫ్లాట్‌ చూసి పెట్టేవారు. ప్రస్తుతం అక్కడ బ్రోకర్ల జాడే కనిపించడం లేదు. వీకెండ్‌లో ఐటీ ఉద్యోగులతో ఆ ప్రాంతం కోలాహలంగా ఉండేది. ప్రతి అపార్ట్‌మెంట్‌లో 30 మందికి పైగా సర్వెంట్లు పని చేసే వారు. వారి సంఖ్య ప్రస్తుతం 15కు పడి పోయింది. బ్యాచ్‌లర్స్‌ ఎక్కువగా ఉండటంతో పని మనుషులకు చేతి నిండా పని దొరికేది.


 
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌
అద్దెకు ఫ్లాట్‌ కావాలనుకునే వారు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్లను సంప్రదిస్తే ఫ్లాట్‌ ఫొటోలతో పాటు అద్దె వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఓనర్లు సైతం ఎక్కువగా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లను సంప్రదిస్తున్నారు. హౌసింగ్‌ డాట్‌.కామ్‌లోనే 73 ఫ్లాట్లు అద్దెకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని పెట్టారు. అందులో వైట్‌ఫీల్డ్, గ్రీన్‌ఫీల్డ్‌లోని ఖాళీగా ఉన్న ఫ్లాట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

తీవ్ర ప్రభావం చూపిన వర్క్‌ ఫ్రం హోం  
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఐటీ కంపెనీలలో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఫ్లాట్లలో అద్దెకు ఉండేవారు. అపార్ట్‌మెంట్లు, సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, గెస్ట్‌హౌస్‌లు కిటకిటలాడేవి. కంపెనీలు వర్క్‌ఫ్రం హోంకు అవకాశం కల్పించడంతో ఐటీ ఉద్యోగులందరూ సొంత ఊర్లకు వెళ్లి అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. వైట్‌ఫీల్డ్‌లోని ఎట్‌ హోం సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో దాదాపు 40 ఫ్లాట్లు ఉండగా ప్రస్తుతం 30 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

రూ.5 వేలు తగ్గించినా..
వాస్తవంగా ఇక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ అద్దె రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌కు విస్తీర్ణాన్ని బట్టి రూ.25 వేల నుంచి రూ.40  వేల వరకు ఉంటుంది. దీంట్లో ఇప్పుడు దాదాపు ఐదు వేల రూపాయల వరకు అద్దె తగ్గించారు. అయినా వచ్చేందుకు ఎవ్వరూ ఆసక్తి కనబర్చడం లేదు. గతంలో రెంటల్‌ ఏజెన్సీలను సంప్రదించే ఓనర్లు.. ఇప్పుడు వారే స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇళ్ల ముందు టులెట్‌ బోర్డుల్లో వారి ఫోన్‌ నెంబర్లే ఇస్తున్నారు.

ఐటీ ఉద్యోగులు వస్తేనే కోలుకుంటాం
ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోంకు అవకాశం ఉండటంతో అంతా వెళ్లిపోయారు. ఎట్‌ హోం ఎప్పుడూ ఉద్యోగులతో సందడిగా ఉండేది. ప్రస్తుతం అద్దెకు వచ్చే వారే కరువయ్యారు. ఐటీ కంపెనీలు తెరిస్తేనే మళ్లీ ఫ్లాట్లు నిండుతాయి. ఇప్పట్లో పరిస్థితి మారేలా కన్పించడం లేదు. మాకు ఉపాధి సమస్యగా మారింది.
– రాజు, సూపర్‌వైజర్, ఎట్‌ హోం
 
40 శాతం ఖాళీ  
వైట్‌ ఫీల్డ్‌లో 40 శాతం ఫ్లాట్లు ఖాళీ అయ్యాయి. గతంలో జయదర్శిని రెసిడెన్సీలో అద్దెకు ఇళ్లు దొరికేది కాదు. ఇప్పుడు అక్కడా టు లెట్‌ బోర్డులు వెలిశాయి. 15 ఏళ్లుగా ఇక్కడ కూరగాయలు, కిరాణా సరుకులు అమ్ముతున్నా. ఇప్పుడు మాకు అస్సలు గిరాకీ లేదు. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 15 ఇళ్లకు సరుకులు డోర్‌ డెలివరీ చేస్తే ఇప్పుడు నలుగురైదుగిరికి మాత్రమే చేస్తున్నాం.
– ముదసిర్, వైట్‌ఫీల్డ్‌       

  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు