బాబోయ్‌.. మేం భరించలేం..ఊపిరాడట్లే!

27 Oct, 2021 08:43 IST|Sakshi

 బాచుపల్లి, కొండాపూర్, నిజాంపేట్‌ నివాసితుల గగ్గోలు

రాత్రి వేళల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆందోళన

51 కాలనీలకు శివారు పరిశ్రమల విష వాయువులు

కాలుష్య నియంత్రణ మండలికి వెల్లువలా ఫిర్యాదులు

సాక్షి, హైదరాబాద్‌: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 51 కాలనీల్లో రాత్రివేళల్లో శివారు పరిశ్రమలు వెదజల్లుతున్న విష వాయువులతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రిపూట ఊపిరి తీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆయా పరిశ్రమల ఆగడాలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తక్షణం సదరు పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులను వేడుకుంటున్నారు. ప్రధానంగా బాచుపల్లి, నిజాంపేట్, మియాపూర్, హఫీజ్‌పేట్, కొండాపూర్, మదీనాగూడ, లింగంపల్లి, గచ్చిబౌలి, బీహెచ్‌ఈఎల్, అమీన్‌పూర్‌ ప్రాంతాలవాసుల అవస్థలు అన్నీఇన్నీ కావు. కొంత కాలంగా కేవలం రాత్రి వేళల్లోనే ఇలాంటి విషవాయువుల వాసనతో తలనొప్పి, వాంతులు, శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నట్లు పీసీబీ దృష్టికి తీసుకురావడం గమనార్హం. 
చదవండి: Huzurabad Bypoll: ఈ ఎన్నిక చాలా ఖరీదు గురూ!


 
పారిశ్రామిక వాడలకు సమీప ప్రాంతాల్లోనే.. 
గ్రేటర్‌తో పాటు శివార్లలోని పలు ప్రాంతాలు వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ప్రధానంగా కాటేదాన్, జీడిమెట్ల, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్, భోలక్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో  బల్క్‌డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, ఆయిల్, లెడ్, బ్యాటరీ, ట్యానింగ్, బ్లీచింగ్‌ అండ్‌  డైయింగ్, పొగాకు, పెయింట్స్, మీట్‌ ప్రాసెసింగ్, పెస్టిసైడ్స్, క్రాఫ్ట్‌ పేపర్‌ తదితర పరిశ్రమలున్నాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి రాత్రివేళల్లో విష వాయువులను వెదజల్లుతుండడంతో ఈ ప్రాంతాలకు దగ్గరున్న కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడకపోవడంతో పీసీబీకి ఫిర్యాదులు తరచూ వెల్లువెత్తుతున్నాయి. 
చదవండి: డెలివరీ బాయ్‌ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో

పరిశ్రమల ఆగడాలిలా.. 
ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకరమైన ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిపుల్‌ ఎఫెక్టివ్‌ ఎవాపరేటర్లు (ఎంఈఈ), ఆర్‌ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం.  గాఢత అధికంగా ఉన్న వ్యర్థ జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్‌ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ఘన,ద్రవ వ్యర్థాలను శుద్ధికేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.  

మరిన్ని వార్తలు