వీడియో: సీపీఆర్‌తో పోయే ప్రాణం తిరిగొచ్చింది.. ట్రాఫిక్‌ పోలీస్‌పై మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు

25 Feb, 2023 02:07 IST|Sakshi

సీపీఆర్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ 

గుండెపోటుతో కుప్పకూలిన వెంటనే స్పందించిన వైనం 

ఆస్పత్రిలో కోలుకుంటున్న ఎల్‌బీనగర్‌ వాసి 

హైదరాబాద్‌ (రాజేంద్రనగర్‌):  రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ గురువారం మధ్యాహ్నం ఆరాంఘర్‌ చౌరస్తాలో డ్యూటీలో నిమగ్నమై ఉన్నాడు. ఆ పక్కనే ఉన్నట్టుండి కలకలం రేగింది. అక్కడున్న వారంతా గుంపుగా ఒకచోట చేరారు. ఏం జరిగిందోనని రాజశేఖర్‌ అక్కడికి చేరుకున్నాడు. ఓ వ్యక్తిపై ఫుట్‌పాత్‌పై స్పృహ లేకుండా పడిపోయి ఉండటం గమనించాడు.

ఆ వ్యక్తి గుండెపోటు వల్లే కుప్పకూలిపోయాడని అతనికి అర్ధమయ్యింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రిససిటేషన్‌) చేశాడు. దీంతో కోలుకున్న వ్యక్తిని వెంటనే 108లో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణం దక్కింది. ఈ సంఘటన టీవీ చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిసింది.

భార్యాపిల్లల్ని చూసి వెళుతుండగా.. 
బాలాజీ (45) కర్నూలు మార్కెట్‌ యార్డులో హమాలీగా పని చేస్తున్నాడు. అయితే ఇతని కుటుంబం హైదరాబాద్‌    ఎల్‌బీనగర్‌ సితార హోటల్‌ వెనుక బస్తీలో ఉంటోంది. దీంతో బాలాజీ వారానికి ఒక రోజు భార్య, ఇద్దరు పిల్లలను చూసేందుకు నగరానికి వస్తుంటాడు. గురువారం కూడా భార్యా పిల్లలను చూసి మధ్యాహ్నం కర్నూలు వెళ్లేందుకు ఆరాంఘర్‌ చౌరస్తాకు చేరుకున్నాడు.

3 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నిల్చొని బస్సు కోసం ఎదురు చూస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఫుట్‌పాత్‌పైనే పడిపోయాడు. అయితే రాజశేఖర్‌ సీపీఆర్‌ చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అత్తాపూర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హయత్‌నగర్‌లోని మరో ఆసుపత్రికి బాలాజీని తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.  

ఫలితం ఇచ్చిన శిక్షణ : 2013 బ్యాచ్‌కు చెందిన పీసీ రాజశేఖర్‌కు గతంలో ట్రాఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చా రు. గుండె నొప్పి వచ్చిన వారికి ఎలా సహాయం చేయాలో నే ర్పించారు. ఇప్పుడదే శిక్షణ బాలాజీ ప్రాణాలు కాపాడింది.  

అభినందనల వెల్లువ: సీపీఆర్‌ చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన రాజశేఖర్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అభినందించారు. నగదు బహుమతి కూడా అందించారు.  

మరిన్ని వార్తలు