హైదరాబాద్‌లో బ్లాక్‌ స్పాట్స్‌పై ట్రాఫిక్‌ పోలీసుల నజర్‌

11 May, 2022 19:37 IST|Sakshi
డీసీపీ ప్రకాష్‌రెడ్డి, బిట్స్‌ పిలానీ నిపుణుల బృందం

రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గింపునకు చర్యలు

బిట్స్‌ పిలానీ క్యాంపస్‌ నిపుణుల సహాయంతో అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యను తగ్గించడానికి ట్రాఫిక్‌ పోలీసులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే బ్లాక్‌ స్పాట్స్‌తో పాటు బ్లాక్‌స్ట్రెచ్‌లపైనా దృష్టి పెట్టారు. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలు సూచించడానికి బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. మరోపక్క బడి పిల్లల భద్రత కోసం ఆధునిక స్కూల్‌ జోన్స్‌ ఏర్పాటు చేయడానికీ కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి డీసీపీ– 1 ఎన్‌.ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించింది.  

స్థానిక పరిస్థితుల ఆధారంగా స్ట్రెచ్‌లు... 
ట్రాఫిక్‌ విభాగం అధికారులు బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించడానికి కేంద్రం అధీనంలోని మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ (ఎంఓఆర్టీహెచ్‌) మార్గదర్శకాలను అనుసరిస్తారు. వీటి ప్రకారం గడిచిన మూడేళ్ల కాలంలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకున్న 50 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించారు. వీటితో పాటు స్థానిక పరిస్థితులను బట్టి రోడ్డు ప్రమాదాలకు కారణమైన బ్లాక్‌ స్ట్రెచ్‌లను సిటీ ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఇవి కనిష్టంగా కి.మీ. నుంచి గరిష్టంగా రెండు కి.మీ. వరకు ఉన్నాయి. బ్లాక్‌ స్పాట్స్, స్ట్రెచ్‌ల్లో పరిస్థితులు మార్చడానికి బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రత్యేక బృందం కారణాలు, నివారణ మార్గాలను సూచిస్తోంది. వీటిని ఆధారంగా జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. (క్లిక్: వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను)

తొలిదశలో పదకొండు ప్రాంతాల్లో పరిశీలన.. 
ట్రాఫిక్‌– బిట్స్‌ పిలానీ అధికారులు, నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం తొలి దశలో నగరంలోని పదకొండు కీలక ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ టీమ్‌ తాడ్‌బండ్‌ గ్రేవ్‌ యార్డ్, డెయిరీ ఫాం, టి జంక్షన్, బోయిన్‌పల్లి ఎక్స్‌ రోడ్స్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, సంగీత్‌ చౌరస్తా, చిలకలగూడ ఎక్స్‌రోడ్స్, రైల్‌ నిలయం, ఆలుగడ్డబావి, మెట్టుగూడ చౌరస్తా, రైల్వే డిగ్రీ కాలేజ్, ట్యాంక్‌బండ్‌ చిల్డ్రన్స్‌ పార్క్‌ ప్రాంతాల్లో పర్యటించింది. అక్కడి పరిస్థితులపై ట్రాఫిక్‌ విభాగం అధికారులు రూపొందించిన మ్యాప్స్‌ సాయంతో బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ నిపుణులు అధ్యయనం చేశారు.  

పాఠశాలల పునఃప్రారంభం లోపు... 
నగరంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు బడి పిల్లల భద్రతకు ఉద్దేశించిన ఆధునిక స్కూల్స్‌ జోన్స్‌ను సిద్ధం చేయాలని ట్రాఫిక్‌ విభాగం అధికారులు నిర్ణయించారు. రద్దీ, పాఠశాల ఉన్న ప్రాంతం తదితరాలను పరిగణనలోని తీసుకుని ఏఏ స్కూళ్ల వద్ద ఇవి ఏర్పాటు చేయాలన్నది నిర్ణయించనున్నారు. ప్రయోగాత్మకంగా నార్త్‌జోన్‌లో ఒకటి, సెంట్రల్‌ జోన్‌లో ఒకటి, వెస్ట్‌జోన్‌లో రెండు పాఠశాలలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. (క్లిక్: వాహనాలపై పెరిగిన గ్రీన్‌ ట్యాక్స్‌!)

మరిన్ని వార్తలు