చుక్కలు చూపిస్తోన్న బేగంపేట ట్రాఫిక్‌

25 Feb, 2021 12:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగర వాసులకు ట్రాఫిక్‌ చుక్కలు చూపిస్తోంది. బేగంపేట-సికింద్రాబాద్‌ మార్గంలో ప్రయాణం వాహన చోదకులకు నిత్యనరకంగా మారుతోంది. గత రెండు రోజులుగా ఈ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీఐపీలు బయటకు వచ్చినప్పుడు కనీస సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపి వేస్తుండటంతో హైదరాబాదీలు ఇక్కట్ల పాలవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లై ఓవర్‌ నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్‌ స్తంభించింది.

గురువారం కూడా ఇదే సీన్‌ రిపీటయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్యారడైజ్‌ నుంచి బేగంపేట వరకు గంటల తరబడి ట్రాఫిక్‌ జామయింది. ఇక బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 1, 3లతో పాటు పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అంబులెన్స్‌లు వెళ్లడానికి కూడా అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సహనం కోల్పోయిన వాహనదారులు పలుచోట్ల ట్రాఫిక్‌ పోలీసులతో వాదనలకు దిగారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్‌ నిలిపివేయడం సరికాదని భాగ్యనగర వాసులు మండిపడుతున్నారు. 

మామూలుగానే బేగంపేట మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బేగంపేట ఫ్లైఓవర్‌ మీద ఏదైనా వాహనం ఆగిపోతే అంతే సంగతులు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే. ఇక ప్రముఖుల రాకపోకల సమయంలోనూ వాహనాలను నియంత్రించడం వల్ల ట్రాఫిక్‌కు త్రీవ అంతరాయం కలుగుతోంది. అయితే వీఐపీలు రావడానికి చాలా సమయం ముందే పోలీసులు వాహనాలను నిలిపివేస్తున్నారని చోదకులు ఆరోపిస్తున్నారు. వీఐపీలు వెళ్లడానికి కొద్ది సమయం ముందు వాహనాలను నియంత్రిస్తే ట్రాఫిక్‌ ఎక్కువగా జామ్‌ అయ్యే అవకాశం ఉండదని అంటున్నారు. ట్రాఫిక్‌ కష్టాలు ఎప్పటికీ తీరతాయోనని ఈ మార్గంలో ప్రయాణించే వారు వాపోతున్నారు.

చదవండి: 
ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడి గర్భిణి మృతి

22 రెగ్యులర్‌ రైళ్లకు పచ్చజెండా

మరిన్ని వార్తలు