నిషేధిత హారన్‌ కొడితే చార్జిషీట్‌

22 May, 2022 01:49 IST|Sakshi

డ్రైవర్, వాహన యజమానిపై కేసు నమోదు

నగర రహదారులపై జూన్‌ 1 నుంచి అమలు  

సాక్షి, హైదరాబాద్‌: చిత్ర విచిత్రమైన ధ్వనులతో హారన్‌ కొడుతూ.. రోడ్లపై  దూసుకుపోతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త! జూన్‌ 1 నుంచి నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై ట్రాఫిక్‌ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు. ఎయిర్, ప్రెషర్, మల్టీటోన్డ్‌ వంటి నిషేధిత హారన్‌ వినియోగిస్తూ ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై నగర ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు.

నిషేధిత హారన్లు వినియోగించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 3,320కిపైగా వాహనాలకు ఉన్న నిషేధిత హారన్లను తొలగించారు.

ఆయా వాహనదారులకు ఎంవీ యాక్ట్‌ 190 (2) సెక్షన్‌ ప్రకారం రూ.1,000 జరిమానా విధించినట్లు నగర ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం (సీఎంవీఆర్‌)–1988 సెక్షన్‌ 52 ప్రకారం తయారీదారుల నుంచి వచ్చిన వాహన హారన్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ప్రతి వాహనానికీ ఎలక్ట్రిక్‌ హారన్‌ మాత్రమే ఉండాలి.

మరిన్ని వార్తలు