Hyderabad: డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ.. ట్రాఫిక్‌ పోలీస్‌ కొత్త ఐడియా

30 Mar, 2022 10:02 IST|Sakshi

సాక్షి,హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): నారాయణగూడ ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న ఐడియాకు శ్రీకారం చుట్టారు. ఓ పక్క ట్రాఫిక్‌ కంట్రోలింగ్‌తో పాటు డ్రైవింగ్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తిస్తున్నారు. లైసెన్సు లేకుండా రోడ్డుపైకి రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో పట్టుబడ్డ వారు లైసెన్సుకు అర్హత కలిగిన వారైతే ట్రాఫిక్‌ పోలీసులే లైసెన్సులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

కొత్తగా ట్రాఫిక్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్‌ ట్రాఫిక్‌ కంట్రోలింగ్, సిబ్బంది పనితీరు వంటి వాటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పదే పదే ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై చార్జ్‌షీట్‌ సైతం వేయాలంటూ ఇటీవల ట్రాఫిక్‌ అధికారులకు రంగనాథ్‌ సూచించారు. ప్రజల్లో ట్రాఫిక్‌ విభాగంపై మంచి అభిప్రాయం వచ్చేందుకు సిబ్బంది సహకారం ఎంతో అవసరమని వారికి చెప్పడంతో..చీఫ్‌ దృష్టిని ఆకర్షించేందుకు నారాయణగూడ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమోహన్‌ ఓ కొత్త ఐడియాకు నాంది పలికారు.

ఎస్సై ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక.. 
డ్రైవింగ్‌ లైసెన్సు కోసం చాలా మంది దళారుల చేతిలో మోసపోతున్నారు. ఇకపై అలా జరగకుండా ఉండేందుకు పోలీసులే వాటిని జారీ చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇందుకోసం పృథ్వీరాజ్‌ అనే ఎస్సైని ఇన్‌స్పెక్టర్‌ కేటాయించారు. డిగ్రీ కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, ఎలక్ట్రానిక్స్, టీ కొట్లలో పనిచేస్తూ..డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా ఉన్న వారిని ఎస్సై పృథ్వీరాజ్‌ గుర్తిస్తున్నారు.  వీరికి ముందుగా డ్రైవింగ్‌ లైసెన్సు జారీకి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను సూచిస్తున్నారు. లోకల్‌ వ్యక్తి అయితే..అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్‌..ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే లైసెన్సుకు ఎటువంటి గుర్తింపు ధృవపత్రాలు ఉండాలనే విషయాలను వారికి వివరిస్తారు. ఇప్పటి వరకు సుమారు 30 మందిని ఎంపిక చేశారు.

ఎల్‌ఎల్‌ఆర్‌కు ఎలా ఎంపిక అవ్వాలి, ఎటువంటి ట్రాఫిక్‌ గుర్తులు ప్రొజెక్టర్‌పై ఉంటాయి, టెస్ట్‌ ఎలా పాస్‌ కావాలనే విషయాలను వివరించనున్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌కు అర్హత కూడా పోలీసు స్టేషన్‌లోనే చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది.  తాము ఈ తరహా ఐడియాకు శ్రీకారం చుట్టామని దీనిని పరిశీలించి అనుమతి ఇస్తే ఓ అడుగు ముందుకేస్తామంటూ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమోహన్‌ ట్రాఫిక్‌ చీఫ్‌ రంగనాథ్‌ను కోరారు. ఆయన సరే అంటే రానున్న రోజుల్లో ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవింగ్‌ లైసెన్సులను జారీ అయ్యే అవకాశం ఉంటుంది. 

మరిన్ని వార్తలు