ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. హోంమంత్రి సీరియస్‌

24 Jul, 2021 19:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాసబ్‌ ట్యాంక్‌లో తెలంగాణ డీజీపీ ప్రోటోకాల్‌ పేరుతో ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డు బ్లాక్‌ చేసి వాహనాలను నిలిపివేశారు. దీంతో రెండు అంబులెన్స్‌లో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. అందులో ఎమర్జెన్సీ కేసులూ ఉన్నాయి. అంబులెన్స్‌ సైరన్‌ మోగుతున్న తమకేం పట్టన్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు వ్యవహరించారు. ఈ ట్రాఫిక్‌లో రెండు అంబులెన్స్‌లు దాదాపు గంటకు పైగా చిక్కుకున్నాయి. ఎంత సేపటికీ ట్రాఫిక్‌ క్లియర్‌ కాకపోవడంతో అంబులెన్స్‌ సిబ్బంది ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వద్దకు వెళ్లి అంబులెన్స్‌లో పేషెంట్‌ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే దారివ్వాలని కోరారు. అయితే దానికి ట్రాఫిక్‌ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు.

దీంతో అంబులెన్స్‌ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్‌ సమస్యను క్లియర్‌ చేశారు. ప్రస్తుతం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా మాసబ్‌ ట్యాంక్‌ పోలీసుల నిర్లక్ష్యంపై హోంమంత్రి మహమూద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ఘటనపై హైదరాబాద్‌ సీపీకి ఫోన్‌ చేసి ఆరా తీశారు.  ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ వివరణ ఇచ్చారు. అయితే మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తానని సీపీ హోంమంత్రికి తెలియజేశారు.

మరిన్ని వార్తలు