Hyderabad-Lockdown: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్‌ పరిస్థితి

16 Jan, 2022 16:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరం నుంచి పెద్ద ఎత్తున జనం సొంతూళ్లకు తరలివెళ్లారు. దీంతో నగరం ఒక్కసారిగా బోసిపోయింది. ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లు, చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి. వాహనాల మోత.. ట్రాఫిక్‌ జామ్‌ల జంజాటం పూర్తిగా తగ్గింది. మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారా అనే విధంగా పరిస్థితి మారిపోయింది. కరోనా కారణంగా రెండేళ్లుగా  చాలా మంది సంక్రాంతికి సైతం సొంతూళ్లకు వెళ్లలేకపోయారు. ఈసారి మాత్రం ముందుగానే ప్లాన్‌ చేసుకొని మరీ ఊళ్లకు వెళ్లారు.

నగర రోడ్ల పైన సాధారణంగా నిత్యం దాదాపు 25 నుంచి 30 లక్షల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అయితే సంక్రాంతి పండుగ ముందు రోజుకే అది సగానికి తగ్గిపోయింది. శుక్రవారం నుంచి పండుగ సెలవులు కావటంతో నగరంలో రద్దీ మరింతగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో వారాంతంలో సహజంగా కొంత మేర రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు మాత్రం నగరం దాదాపుగా బోసి పోయిన వాతావరణం కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్‌తో కుస్తీ పట్టే నగరవాసులు..ఇప్పుడు హైవే మీద వెళ్లినట్లుగా నగరంలోని రోడ్లపైన ఈజీగా ప్రయాణం చేస్తున్నారు. ఇక కాలనీలు, బస్తీలు సైతం జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి.  

చదవండి: (నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు.. అంతలోనే..)

తగ్గిన వ్యాపారం 
జనం లేక షాపింగ్‌ మాల్స్, దుకాణాలు బోసిపోయాయి. గత మూడు రోజులుగా నగరంలోని అన్ని రకాల వ్యాపారాలు కూడా తగ్గిపోయినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిసారి సంక్రాంతి సీజన్‌లో ఇదే జరుగుతుందని, ఈసారి మాత్రం మరికొంత పెరిగినట్లు చెబుతున్నారు. ఓ వైపు కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థికపరిస్థితులు..మరోవైపు సొంతూళ్ల ప్రయాణాల కారణంగా దాదాపు 30 నుంచి 40 శాతం వ్యాపారం తగ్గిపోయినట్లు అంచనా వేస్తున్నారు. కొత్త దుస్తులు, నగలు, గృహోపకరణాల కొనుగోళ్లు కూడా బాగా క్షీణించాయంటున్నారు.  

చదవండి: (తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..)

మరిన్ని వార్తలు