Tspsc Case: మిగతా పరీక్షల రద్దుపై టీఎస్‌పీఎస్సీ ఏం చేప్తోంది!

17 Mar, 2023 07:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అసిస్టెంట్‌ ఇంజనీర్‌ అర్హత పరీక్షను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మిగతా పరీక్షలను కూడా రద్దు చేయాలనే డిమాండ్‌ తీవ్రమవుతోంది. గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఆ తర్వాత నిర్వహించిన పలు పరీక్షల ప్రశ్నపత్రాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయంటూ అభ్యర్థులతో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళనలు ఉదృతం చేస్తున్నాయి. ఈ దిశగా కమిషన్‌ కార్యాలయం వద్ద, జిల్లాల్లోనూ తీవ్రస్థాయిలో నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు.

అయితే టీఎస్‌పీఎస్సీ మాత్రం దీనిపై స్పష్టమైన వైఖరితోనే ఉంది. సరైన ఆధారాలు ఉంటే పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆదరబాదరా నిర్ణయం తీసుకోలేమని, తొందరపడి, ఒత్తిడికి గురై నిర్ణయాలు తీసుకుంటే అభ్యర్థుల భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడుతుందని చెబుతున్నాయి. ఇప్పటివరకు కేవలం అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రమే లీకైనట్లు తేలడంతో, లోతుగా చర్చించి అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆ పరీక్షను రద్దు చేసినట్లు కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. 

సిట్‌ విచారణలో తేలాకే.. 
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, కంప్యూటర్ల నుంచి సమాచారం తస్కరణపై నమోదైన కేసులపై సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) దర్యాప్తు ముమ్మరం చేసింది. గత రెండ్రోజులుగా సిట్‌ సభ్యులు కమిషన్‌ కార్యాలయంలోని అధికారులను, ఉద్యోగులు, సిబ్బందిని పలు దఫాలుగా విచారిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచారణ అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిట్‌ పరిశీలనలో తేలిన అంశాలు, నిందితుల ఫోన్లు, పెన్‌డ్రైవ్‌ల్లోని సమాచారం తదితరాలపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్‌ నివేదిక అందిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. ఏఈ పరీక్షను రద్దు చేసిన అధికారులు..మిగతా పరీక్షలకు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తిగా నిగ్గుతేలి్చన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు.    

మరిన్ని వార్తలు